వైన్ గ్లాస్‌, మొబైల్ ఫోన్‌తో శివుడి జిఫ్‌!

వైన్ గ్లాస్‌, మొబైల్ ఫోన్‌తో శివుడి జిఫ్‌!
హిందువుల మ‌నోభావాల‌ను ఇన్‌స్టాగ్రామ్‌ దెబ్బ‌తీస్తున్న‌ట్లు ఢిల్లీకి చెందిన బీజేపీ నేత ఫిర్యాదు చేశారు. జిఫ్ ఫార్మాట్‌లో శివుడిని అనుచిత రీతిలో ఆ యాప్ చిత్రీక‌రించిన‌ట్లు మ‌నీష్ సింగ్ ఆరోపించారు. ఒక చేతిలో మ‌ద్యం గ్లాసు, మ‌రో చేతిలో మొబైల్ ఫోన్‌తో ఉన్న శివుడి జిఫ్‌ ఇమేజ్‌ల‌ను ఇన్‌స్టాలో పోస్టు చేశారు. 
 
దీనిపై అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన బీజేపీ నేత‌.. పార్ల‌మెంట్ వీధిలో ఉన్న పోలీస్ స్టేష‌న్‌లో  ఇన్‌స్టాగ్రామ్ సీఈవో, ఇత‌ర అధికారుల‌పై ఫిర్యాదు న‌మోదు చేశారు. శివుడిని ల‌క్ష‌ల సంఖ్య‌లో హిందువులు భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో పూజిస్తార‌ని, ఆయ‌న్ను ఆది దేవుడిగా ఆరాధిస్తార‌ని గుర్తు చేశారు. 
 
అయితే  గ్రాఫిక్స్ ఫార్మాట్‌లో ప‌ర‌మేశ్వ‌రుడిని అభ్యంత‌రక‌ర రీతిలో చిత్రీక‌రించార‌ని మ‌నీష్ సింగ్ త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీయాల‌న్న ఉద్దేశంతోనే ఆ జిఫ్‌ను త‌యారు చేసినట్లు ఆయ‌న ఆరోపించారు. 
 
హిందువుల‌ను రెచ్చ‌గొట్టి, విద్వేషాలు క్రియేట్ చేయాల‌న్న ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నట్లు ఆయ‌న పేర్కొన్నారు. శివుడిని అవ‌మాన‌క‌ర రీతిలో చిత్రీక‌రించిన ఇన్‌స్టాగ్రామ్ సీఈవోపై క్రిమిన‌ల్ కేసు పెట్టాల‌ని ఆయ‌న కోరారు.