చిన్న ప‌రిశ్ర‌మ‌ల‌కు ప్ర‌పంచ బ్యాంకు 50 కోట్ల డాల‌ర్లు!

క‌రోనా సంక్షోభంతో భార‌త్‌లో భారీగా దెబ్బ తిన్న సూక్ష్మ‌, చిన్న మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల (ఎంఎస్ఎంఈ) పున‌ర్జీవింప జేయ‌డానికి ప్ర‌పంచ బ్యాంకు ముందుకు వ‌చ్చింది. ఇందుకోసం 50 కోట్ల డాల‌ర్ల సాయం చేయాల‌న్న నిర్ణ‌యానికి ప్ర‌పంచ బ్యాంక్ డైరెక్ట‌ర్ల బోర్డు ఆమోదం తెలిపింది.

భార‌త్‌లో ఎంఎస్ఎంఈల పురోగ‌తికి ప్ర‌పంచ బ్యాంక్ ఆర్థిక సాయం ప్ర‌క‌టించ‌డం ఇది రెండోసారి. గ‌తేడాది జూలైలో 75 కోట్ల డాల‌ర్ల నిధుల‌ను ఎంఎస్ఎంఈ ఎమ‌ర్జెన్సీ రెస్పాన్స్ ప్రోగ్రామ్ కింద కేటాయించింది.

దేశంలోని ఎంఎస్ఎంఈల ప‌నితీరు మెరుగుద‌ల‌కు ప్ర‌పంచ బ్యాంకు ల‌క్ష్యాలు నిర్దేశించింది. ఎంఎస్ఎంఈ కాంపిటీటివ్‌నెస్ పోస్ట్ కోవిడ్ రీసైలెన్స్ అండ్ రిక‌వ‌రీ ప్రోగ్రామ్ (ఎంసీఆర్ఆర్పీ) కింద కేంద్రం 340 కోట్ల డాల‌ర్ల నిధులు కేటాయించింది. ఎంఎస్ఎంఈల పురోగ‌తికి 15.5 బిలియ‌న్ల డాల‌ర్ల నిధులు సేక‌రించాల్సి ఉంటుంది.

తీవ్రంగా దెబ్బ తిన్న ఎంఎస్ఎంఈల‌కు త‌క్ష‌ణం ద్ర‌వ్య ల‌భ్య‌త‌, రుణ ప‌ర‌ప‌తి అవ‌స‌రాల‌ను ప్ర‌పంచ బ్యాంకు కేటాయించిన నిధులు తోడ్పాటునిస్తాయి. ఇప్ప‌టివ‌ర‌కు కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న కార్య‌క్ర‌మం కింద 50 ల‌క్ష‌ల ఎంఎస్ఎంఈలు నిధులు పొందాయి.

ఎంఎస్ఎంఈల్లో ప్రొడ‌క్టివిటీ, ద్ర‌వ్య ల‌భ్య‌త‌ను మెరుగు ప‌రిచేందుకు గ‌త ఏడాది కాలంలో 125 కోట్ల డాల‌ర్ల నిధుల‌ను ప్ర‌పంచ బ్యాంక్ స‌మ‌కూర్చింది. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు వెన్నెముక‌గా ఉన్న ఎంఎస్ఎంఈలు దేశ జీడీపీలో 30 శాతం. ఎగుమ‌తుల్లో 40 శాతం. భార‌త్‌లో 5.8 కోట్ల ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. వాటిలో 40 శాతానికి పైగా ఎంఎస్ఎంఈలకు ప్ర‌భుత్వ నిధులు అందుకోలేక‌పోతున్నాయి.