సువేందు అధికారిపై కేసు, బిజెపి కార్యాలయం వద్ద బాంబులు 

సువేందు అధికారిపై కేసు, బిజెపి కార్యాలయం వద్ద బాంబులు 

పశ్చిమ బెంగాల్‌ బిజెపి నాయకుడు, నూతన శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు  సువేందు అధికారిపై చోరీ కేసు నమోదైంది. కంతి మున్సిపాలిటీ నుంచి లక్షల విలువైన సామగ్రిని చోరీ చేశారనే ఫిర్యాదు మేరకు సువేందు అధికారి, అతని సోదరుడు సౌమేందు అధికారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

కంతి మున్సిపల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ బోర్డ్‌ సభ్యుడు రత్నదీప్‌ మన్నా ఈ నెల 1న సువేందు అధికారి, అతడి సోదరుడు సౌమేందు అధికారిపై చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

మే 29న సువేందు అధికారి, మాజీ కంతి మున్సిపాలిటీ చీఫ్ సౌమేందు అధికారి  కార్యాలయ గోడౌన్‌లోకి  అక్రమంగా చొరబడి లక్షలు విలువచేసే సామగ్రిని దోచుకువెళ్లారని రత్నదీప్‌ మన్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీలో సువేందు అధికారి కేంద్ర సాయుధ బలగాలను సైతం ఉపయోగించారని తన  ఫిర్యాదులో రత్నదీప్‌ మన్నా పేర్కొన్నారు.

కాగా, మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో నందిగ్రామ్ నుండి ముఖ్యమంత్రి మమతా బెనర్జీని సువెందు అధికారి ఓడించడం తెలిసిందే. 

బిజెపి కార్యాలయం దగ్గర బాంబుల కలకలం 

పశ్చిమ బెంగాల్‌లో మరోసారి బాంబులు కలకలం సృష్టించాయి. కోల్‌కతా ఖిద్దర్‌పూర్‌ హేస్టింగ్‌ క్రాసింగ్‌ ఏరియాలో సుమారు 50కిపైగా ముడి బాంబులను పోలీసులు శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. బాంబులు దొరికిన ప్రదేశానికి దాదాపు 20 మీటర్ల దూరంలోనే ఎన్నికల సమయంలో బీజేపీ ఏర్పాటు చేసుకున్న కార్యాలయం ఉన్నది. 

పండ్ల ప్యాకింగ్‌కు వినియోగించే నాలుగు సంచుల్లో బాంబులను గుర్తించగా.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాండ్‌ స్క్వాడ్‌, యాంటీ రౌడీ స్క్వాడ్‌ విభాగానికి చెందిన బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని బాంబులను స్వాధీనం చేసుకున్నాయి. 

బాంబాలు పెద్ద ఎత్తున ఉండడంతో పేలితే తీవ్ర నష్టం జరిగేదని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. బాంబులు అక్కడికి ఎలా వచ్చాయో తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీలను సైతం పరిశీలిస్తున్నట్లు చెప్పారు.