షర్మిల పార్టీ పేరు “వైఎస్సార్ తెలంగాణ పార్టీ”

వైఎస్ షర్మిళ పార్టీ పేరు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ గా ఖరారైంది. ఆ పేరును కేంద్ర ఎన్నికల కమీషన్ వద్ద నమోదు చేసారు. పార్టీ జెండా,  అజెండా,  విధివిధానాలను అధికారికంగా వైఎస్ జయంతి రోజున జులై 9న ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాజకీయ వర్గాల్లో సంచలనం రేకెత్తించే రీతిలో పార్టీ ప్రకటన చేసిన వైఎస్ షర్మిళ లోటస్ పాండ్ నుండి తన తల్లి, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయమ్మతో కలసి పార్టీ కార్యకలాపాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లాలో బహిరంగ సభ ద్వారా తన రాజకీయ ప్రవేశాన్ని ఆమె స్పష్టం అని తేల్చి చెప్పారు.
జూన్ 8 నుంచి పార్టీ ఆవిర్భావ సన్నాహ కార్యక్రమాలు చేపట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జులై 21 నుంచి పాదయాత్ర చేపట్టాలని వ్యూహరచన చేస్తున్నారు. తెలంగాణలో షర్మిల చిన్న నాటి స్నేహితురాలు రజిని సొంత అన్నయ్య వాడుక రాజగోపాల్ షర్మిల పాదయాత్ర సమయంలో ప్రతి నిమిషం వెన్నంటి నిలిచారు. 
 
వాడుక రాజగోపాల్ వైఎస్ రాజశేఖర రెడ్డికి వీరాభిమాని కూడా. షర్మిలకు ఇప్పుడున్న అనుచరులలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి రాజగోపాల్. ఎన్నికల కమీషన్ గుర్తింపు కోసం ఆయనే దరఖాస్తు చేశారు. పార్టీకి గుర్తింపు వచ్చిన తరువాత అధ్యక్షురాలిగా షర్మిలను ఎన్నుకునే అవకాశం ఉంది.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని పత్రికా ప్రకటన కూడా ఇచ్చింది. పార్టీ పేరుపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 16 లోపు తెలపాలని అందులో పేర్కొన్నారు. తన అన్న జగన్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీకి దగ్గరగా,  తెలంగాణ పేరు కలిసొచ్చేలా ఉన్నందునే వైఎస్సార్‌టీపీ పేరుకు షర్మిల మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
 
మరోవైపు తెలంగాణలో రాజన్న రాజ్యంమే లక్ష్యం అంటూ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్న షర్మిల.. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై ఇప్పటికే విమర్శలకు పదను పెట్టారు. నిరుద్యోగం, కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చడం లాంటి అంశాలపై సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటికే విద్యార్థి, మహిళా సంఘాలతో షర్మిల సమావేశమయ్యారు.