టీఆర్ఎస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఈటెల రాజీనామా

టీఆర్ఎస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఈటెల రాజీనామా

మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. నేడు మీడియా మీట్ నిర్వహించిన ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఈటల పలు ఆసక్తికర, సంచలన విషయాలు చెప్పుకొచ్చారు. 

‘‘ అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా నాపై చర్యలు తీసుకున్నారు. రాత్రికి రాత్రే కేబినెట్‌ నుంచి నన్ను బర్తరఫ్‌ చేశారు. ఉరిశిక్ష పడ్డ ఖైదీని కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారు. కనీసం నా వివరణ కూడా తీసుకోకుండా చర్యలు తీసుకున్నారు. నా అనుచరులను బెదిరింపులకు గురిచేసినా తట్టుకొని నిలబడ్డారు” అంటూ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహారశైలిపై నిప్పులు చెరిగారు. 
 
‘‘హుజురాబాద్‌లో ఏ ఎన్నిక జరిగినా పార్టీని గెలిపించుకున్నాం. ప్రాణం ఉండగానే నన్ను బొందపెట్టాలని ఆదేశాలిచ్చారు. నన్ను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని హుజూరాబాద్‌ ప్రజలు చెప్పారు. పదవుల కోసం నేను ఏనాడూ పాకులాడలేదు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ఎన్నోసార్లు రాజీనామా చేశానని’’ ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. 
 
“నాపై జరుగుతోన్న కుట్రలు, కుతంత్రాలను ప్రజలు గమనిస్తున్నారు. నాకు హుజురాబాద్‌ ప్రజలు ధైర్యం చెబుతున్నారు. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా’’ అని ప్రకటించారు. ఈటలతో పాటు ఈ మీడియా సమావేశంలో ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ, అందే బాబయ్య ముదిరాజ్, ఇల్లంత కుంట ఎంపీపీ లతా శ్యామ్.. జమ్మికుంట మాజీ ఎంపీపీ కూడా పాల్గొన్నారు.
 
ఐదేళ్ల క్రితం నుండే కేసీఆర్ తో గ్యాప్ 
 
 ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తనకు వచ్చిన గ్యాప్ ఇవాళ రాలేదని,  ఐదేళ్ల క్రితమే వచ్చిందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ సందర్భంగా ఈటెల వెల్లడించారు.  ఉద్యమ నాయకులను గెలిపించిన చరిత్ర కరీంనగర్‌ జిల్లాకు ఉంది. కేసీఆర్‌ కుట్రలు, డబ్బు, అణిచివేతను నమ్ముకున్నాడు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు. కానీ ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోరని అంటూ నిశితంగా విమర్శలు కురిపించారు. 
 
సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదు. కేసీఆర్‌ను కలవడానికి ఎమ్మెల్యేలం అందరం వెళితే గేట్ దగ్గరే ఆపేశారు. రెండో సారి అపాయింట్ మెంట్ తీసుకుని పోయాం. రెండోసారి కూడా గేట్ల నుంచే బయటకు పంపించారు. మూడోసారి అలాగే జరిగితే కోపంగా వెళ్లి గోళీలు ఇచ్చే ఎంపీ సంతోష్‌ను అడిగాను. అది ప్రగతి భవన్‌ కాదు. బానిస భవన్ అని పేరు పెట్టుకోవాలని చెప్పా అంటూ రాజేందర్ వెల్లడించారు.
 
సీఎంవోలో ఒక్క బీసీ కానీ, ఎస్సీ అధికారి ఉన్నారా? బానిస కంటే అధ్వాన్నంగా ఉన్న మంత్రి పదవి ఎందుకు? అంటూ ప్రశ్నించారు.  రాష్ట్రం కోసమే ఇన్నాళ్లు అవమానాలు భరించా. వైద్య మంత్రి లేకుండానే సమీక్షలు చేస్తున్నారు. ఉద్యమ సమయంలో సంఘాలు కావాలి. ఇప్పుడు సంఘాలు వద్దా? బొగ్గు గనులతో సంబంధం లేని వ్యక్తులు ఆ సంఘాన్ని నడుపుతున్నారని విమర్శించారు.

హరీష్‌రావుకూ ఎన్నో అవమానాలు

టీఆర్ఎస్ పార్టీలో తనతో పాటు మంత్రి హరీష్‌రావు సైతం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారని రాజేందర్ ఆరోపించారు.  ‘‘సంక్షేమ పథకాలను ఏనాడు వ్యతిరేకించలేదు. వందల కోట్లు ఇన్కమ్ టాక్స్ కట్టేవాళ్లకు రైతు బంధు ఇవ్వొద్దని చెప్పిన. అది చెప్పడం తప్పేలా అవుతుంది? ” అంటూ కేసీఆర్ ను నిలదీశారు. బెంజ్ కార్లలో తిరిగేవాళ్లకు కూడా రైతు బంధు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. 
 
నయీం లాంటి వ్యక్తులు చంపుతానని బెదిరించినా తెలంగాణ జెండా వదలలే. ఆర్థిక మంత్రిగా టీఎన్జీవోలు నన్ను కలిస్తే అవహేళన చేశారు. తెలంగాణ బొగ్గు గని కార్మిసంఘం నేను పెట్టిస్తే దాన్ని ఇప్పుడు సీఎం కేసీఆర్ కూతురు కవిత నడుపుతోంది. ఆర్టీసీ కార్మిక సంఘాన్ని నేను, హరీష్ రావు పెట్టిస్తే. కవితకు అప్పగిస్తున్నారని వివరించారు. కేసీఆర్ తన సొంత కూతురుకు భీ ఫాం ఇచ్చానా ఓడిపోయింది కదా అని ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. అసలు ఆమెకు బొగ్గగణి కార్మిక సంఘంలో ఏం పని అని ఈటల ప్రశ్నించారు. 
 
ఏ సంఘానికీ ఈ రోజు హక్కులు లేవు. ధర్నా చౌక్ కూడా లేదు. ఇవి మేము అడుగొద్దా? పెన్షన్‌లు సీఎంకు చెప్పి ఇప్పిస్తా అని చెప్పడం తప్పా? ఐకేపీ సెంటర్లు ఉంటాయ్.. ధాన్యం కొంటాయ్ అని చెప్పడం తప్పా? రోషం గల బిడ్డను కాబట్టే ఆనాడుటీ ఆర్ఎస్‌లో చేరినా. మంత్రి పదవి ఇచ్చి బానిస బతుకు బతకమంటే సాధ్యమా?… అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
“నీవు లల్లు, మాయావతిలాగా పెట్టిన పార్టీ కాదు. వందల మంది బలిదానం చేస్తే రాష్ట్రం వచ్చింది. అందర్ వాలే బాహర్, బాహర్ వాలే అందర్ అన్నట్లుగా ఉంది’’ అని ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు.