ప్రధాని ట్విట్టర్ లో రాజకీయ ప్రత్యర్థులను కూడా …!

ప్రధాని ట్విట్టర్ లో రాజకీయ ప్రత్యర్థులను కూడా …!
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తనను విమర్శించే వారిని తన ట్విట్టర్‌ అకౌంట్లో తొలగిస్తున్నారు.  కానీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిత్యం తనపై విమర్శలు కురిపించే తన రాజకీయ ప్రత్యర్థులను సహితం తన ట్విట్టర్ హేండిల్ లో `ఫాలో’ అవుతున్నారు. ప్రధానిపై నిత్యం నిప్పుల వర్షం కురిపించే రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వంటి వారిని ఆయన అనుసరిస్తున్నారు. 
 
రాహుల్ గాంధీ ఈ మధ్యనే ట్విట్టర్లో 50 మందికి పైగా తన సహాయకులు, పాత్రికేయులు, మరొకొందరిని `‘అన్‌ఫాలో’’ అయ్యారు. ఆయన మద్దతుదారులకు సహితం విస్మయం కలిగించింది. 
 
అయితే ప్రధాని మోదీ తన వ్యక్తిగత హేండిల్ నుండి ట్విట్టర్ లో బిజెపిని వదిలి, ప్రతిపక్ష శిబిరంలో చేరి తరచూ తనపై విమర్శలు కురిపించే నవజోత్ సింగ్ సిద్దూ, కీర్తి ఆజాద్, ఉదిత్ రాజ్ వంటి వారిని  అనుసరిస్తున్నారు.  2015లో బిజెపిని విడిచిపెట్టి, లిబరల్ డెమోక్రటిక్ పార్టీని స్థాపించిన ప్రడియో బోరాను కూడా అనుసరిస్తున్నారు.
“2014 లో నరేంద్ర మోదీ ప్రధాని అయినప్పుడు, పాత ప్రధానమంత్రి కార్యాలయ ట్విట్టర్ ఖాతా వందలాది మంది వ్యక్తులను బ్లాక్ చేసిందని మేము కనుగొన్నాము. విస్తృతమైన పాలనలో వారందరినీ కొత్త పాలనలో అన్‌బ్లాక్ చేశారు ”అని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. అయితే ప్రధాని మోదీ అందుకు భిన్నంగా, తనను, కేంద్ర ప్రభుత్వాన్ని నిత్యం విమర్శించే అనేకమంది ప్రతిపక్ష నాయకులను కూడా అనుసరిస్తున్నారు. ట్విట్టర్ లో ప్రధానిని అనుసరిస్తున్న వారు 1.88 కోట్లమందికి పైగా ఉండగా, ఆయన 1371 మందిని అనుసరిస్తున్నారు. 
 
వారిలో ఎక్కువ మంది రాజకీయ ప్రత్యర్థులే. ఆయన ఒక విధంగా `ట్విట్టర్ దౌత్యం’ ప్రదర్శిస్తున్నట్లు అనిపిస్తున్నది. ట్విట్టర్ ప్రకారం అందులో ప్రజాదరణతో ప్రపంచంలో ప్రధాని మోదీ 59వ వరుసలో ఉన్నారు. 
 
ఇదివరలో పాలక జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) లో భాగస్వాములై, ఇప్పుడు తనను నిశితంగా విమర్శిస్తున్న  మాజీ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి) నాయకుడు మెహబూబా ముఫ్తీ, గత ఏడాది కేంద్ర మంత్రివర్గం నుండి రాజీనామా చేసి, ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఐడి) నాయకురాలు హర్సిమ్రత్ కౌర్ బాదల్ లను కూడా అనుసరిస్తున్నారు.

మాజీ జనతాదళ్ (యునైటెడ్) నాయకుడు శరద్ యాదవ్, హర్యానా కాంగ్రెస్ ఎంపి దీపెందర్ సింగ్ హుడా, పంజాబ్ ముఖ్యమంతిర్ కెప్టెన్ అమరీందర్ సింగ్ లను కూడా అనుసరిస్తున్నారు. నిత్యం తనపై విమర్శలు కురిపించే శశి థరూర్, రణదీప్ సుర్జేవాలా, దిగ్విజయ సింగ్, అజయ్ మాకెన్, అభిషేక్ మను సింగ్వి, పృథీవ్‌రాజ్ చవాన్, మిలింద్ డియోరా, ఆర్‌పిఎన్ సింగ్, దివంగత అహ్మద్ పటేల్ లను ప్రధాని అనుసరిస్తున్నారు. .

మాజీ ముఖ్యమంత్రులు హెచ్‌డి కుమారస్వామి, అఖిలేష్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, బీహార్ మాజీ డిప్యూటీ సిఎం తేజశ్వి యాదవ్‌, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలను కూడా మోదీ  ట్విట్టర్‌లో అనుసరిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ నేత, అభిషేక్ బెనర్జీ,  శివసేన అధినేత ఆదిత్య ఠాక్రే వంటి యువ ప్రతిపక్ష నాయకులను కూడా అనుసరిస్తున్నారు.