అన్‌లాక్‌ ప్రక్రియపై మాట మార్చిన ఉద్ధవ్‌ ఠాక్రే

మహారాష్ట్రలో అయిదంచెల అన్‌లాక్‌ ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమవుతుందని సహాయ, పునరావాస మంత్రి ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఉద్ధవ్‌ ఠాక్రే నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం యూ-టర్న్‌ తీసుకుంది. 
 
కరోనాను ఇంకా నియంత్రించాల్సి ఉన్నందున ప్రస్తుతం రాష్ట్రంలో అమలులో ఉన్న లాక్‌డౌన్‌ ఆంక్షలను ఎక్కడా సడలించబోమని స్పష్టం చేసింది. వేర్వేరు ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి ఆంక్షలను తొలిగించాలనే అంశం కేవలం పరిశీలనలో ఉన్నదని, ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ఒక ప్రకటన విడుదల చేసింది. 
 
పైగా, రాష్ట్రం ఇంకా పూర్తిగా కరోనా నుండి బైటపడలేదని, గ్రామీణ ప్రాంతాలలో కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. అన్ని జిల్లాలోని పరిస్థితులను సవివరంగా సమీక్షించిన అనంతరమే ఈ ప్రతిపాదనను పరిశీలిస్తామని స్పష్టం చేసారు. 
 
అంతకుముందు అయిదంచెల్లో లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని నిర్ణయించినట్టు సహాయ, పునరావాస మంత్రి విజయ్‌ వడెట్టివార్‌ వెల్లడించారు.  అయితే ఈ ప్రకటనపై విజయ్ వాడేటివార్ మరోసారి స్పందించారు. ఆక్సిజన్​ బెడ్స్​ లభ్యత, పాజిటివిటీ రేట్​ తగ్గుదల పరిస్థితుల దృష్ట్యా  లాక్​డౌన్​ ఎత్తివేతకు నిర్ణయం తీసుకున్న మాట వాస్తవమేనని, అయితే దీనిపై అధికారికంగా ఒక స్పష్టత రాలేదని ఆయన చెప్పారు.
కాగా, ఈ తీరు చూస్తుంటే మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వంలో శివ సేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య సమన్వ్యయం  లేదని మరోసారి తేలిపోయినదని  బీజేపీ నేత సుధీర్ ముంగంటివార్, ఇతర ప్రతిపక్ష నేతలు ఎద్దేవా చేశారు. మంత్రి ఒక ప్రకటన చేతే, ముఖ్యమంత్రి కార్యాలయం మరొకటి చేస్తున్నదని విస్మయం వ్యక్తం చేశారు.

కాగా, మహారాష్ట్రలో బుధవారం 15 వేలకు పైగా కొత్త కేసులు, 285 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలోని 36 జిల్లాల్లో పాజిటివిటీ రేటు, ఆక్సిజ‌న్ ప‌డ‌క‌ల ఆక్యుపెన్సీ ప‌రిస్థితి ఆధారంగా మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం అన్ లాక్ ప్ర‌క్రియ‌ను అమలు చేయాలని కీలక సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.