భారతీయుల సేవలు కోవిడ్ నిరోధానికి దోహదం

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వద్ద అత్యున్నత స్థాయి మెడికల్ అడ్వయిజర్ ఆంథోనీ ఫౌచీ గ్లోబల్ సైంటిఫిక్ నాలెడ్జ్‌కి భారత దేశం అందిస్తున్న సేవలను ప్రశంసించారు. భారతీయుల విజ్ఞానం కోవిడ్-19 నిరోధం, తదనంతర సంరక్షణలో ఇప్పటికే ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. 

ఆరోగ్య రంగంలో పరస్పర సహకారంపై యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరం (యూఎస్ఐఎస్‌పీఎఫ్) వెబినార్‌లో ఆయన మాట్లాడుతూ  భారత దేశం ప్రస్తుతం అత్యంత తీవ్రమైన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్లు రాక ముందు, కొద్ది నెలల క్రితం అమెరికా కూడా ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొందని చెప్పారు.

ఇటువంటి సంక్షోభాన్ని పరిష్కరించడంలో సైన్స్ పాత్ర అత్యధికమని చెప్పారు. అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ (ఎన్ఐఏఐడీ) భారత దేశంలోని సంబంధిత సంస్థలతో కలిసి పని చేయడం చాలా కాలం నుంచి జరుగుతోందని, ఈ సమష్టి కృషికి సుదీర్ఘ చరిత్ర ఉందని తెలిపారు. వ్యాక్సిన్ కార్యాచరణ ప్రణాళికపై భారత్-అమెరికా దీర్ఘకాలిక ప్రాతిపదికపై పని చేస్తున్నాయని పేర్కొన్నారు. SARS-CoV-2 వ్యాక్సిన్లకు సంబంధించిన పరిశోధనలో భారత దేశంతో కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు.

కోవిడ్-19 థెరప్యూటిక్స్ భద్రత, సమర్థతలను మూల్యాంకనం చేయడం కోసం గ్లోబల్ క్లినికల్ ట్రయల్స్‌లో భారతీయ  ఇన్వెస్టిగేటర్స్‌ను, వారి విజ్ఞానాన్ని వినియోగించుకోవడం కోసం తాము ఆత్రుతగా ఎదురు చూస్తున్నామని తెలిపారు. అమెరికా-భారత దేశం భాగస్వామ్యం వల్ల గతంలో కూడా ప్రజారోగ్య రంగంలో అనేక సత్ఫలితాలు వచ్చాయని తెలిపారు.

అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్), భారత దేశంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) మధ్య భాగస్వామ్యం వల్ల గతంలో సైంటిఫిక్, పబ్లిక్ హెల్త్ రంగాల్లో చాలా ముఖ్యమైన ప్రగతి సాధించినట్లు వివరించారు.

గ్లోబల్ సైంటిఫిక్ నాలెడ్జ్‌కి భారత దేశం అందిస్తున్న సేవల గురించి అందరికీ తెలుసునని చెప్పారు. భారత ప్రభుత్వం గట్టిగా మద్దతివ్వడంతోపాటు శక్తిమంతమైన ప్రైవేటు బయోఫార్మా రంగం భారత దేశంలో ఉందని పేర్కొన్నారు. వీటి విజ్ఞానం వల్ల ఇప్పటికే కోవిడ్-19 మహమ్మారి నిరోధం, తదనంతర సంరక్షణలో సత్ఫలితాలు వస్తున్నాయని తెలిపారు.

అమెరికాలో భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు మాట్లాడుతూ, కోవిడ్-19 మహమ్మారితో పోరాటంలో భారత్-అమెరికా మధ్య సహకారం చాలా ముఖ్యమైనదని తెలిపారు.