సౌదీ మసీదుల్లో లౌడ్‌ స్పీకర్ల వినియోగంపై ఆంక్షలు

సౌదీ అరేబియా మసీదుల్లో లౌడ్‌ స్పీకర్ల వినియోగంపై ఆంక్షలు విధించింది. లౌడ్‌ స్పీకర్ల వాల్యూమ్‌లో మూడో వంతు మాత్రమే సెట్‌ చేయాలని ఆదేశించింది. అలాగే, కోవిడ్‌ 19 మార్గదర్శకాల ప్రకారం అజాన్‌ కోసం ఈ లౌడ్‌ స్పీకర్ల వినియోగాన్ని మసీదుల్లో నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మేరకు సౌదీ అరేబియా దేశ ఇస్లామిక్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆదేశించింది. దేశంలోని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ప్రతిస్పందనగా తాము మసీదుల్లోని లౌడ్‌ స్పీకర్లలో సౌండ్‌ తగ్గించాలని ఆదేశించినట్టు శాఖ మంత్రి అబ్దుల్లా లతీఫ్‌ అల్‌ షేక్‌ చెప్పారు.

లౌడ్‌ స్పీకర్లు తమ పిల్లల నిద్రకు భంగం కలిగిస్తున్నాయని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదులు ఉన్నాయని మంత్రి షేక్‌  ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత రెండు సంవత్సరాలుగా ఈ విషయం అంతటా  విసృత చర్చ జరిగింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులలో లౌడ్ స్పీకర్ ల ద్వారా వచ్చే ప్రవచనాలను వినకపోవడం అనేది ఖురాన్ ను అగౌరవ పరిచినట్టే అవుతుంది అని పేర్కొన్నారు.

స్టేట్‌ టెలివిజన్‌ చూపించిన వీడియోలో మంత్రి మాట్లాడుతూ, ప్రార్థన చేయాలనుకునే వారు ప్రార్థనకు ఇమామ్‌ పిలుపు కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదని మంత్రి  అన్నారు. ప్రపంచంలో కొన్ని దేశాల్లో మసీదుల్లో ప్రార్థనల పేరిట మైక్‌లలో పెద్ద సౌండ్‌ పెడుతూ చుట్టు పక్కల ఉన్నవారికి ఇబ్బంది పెడుతున్నట్లు వస్తున్న వార్తలను మనం గమనిస్తూనే ఉన్నాం.