పెళ్లి అంటే జంకు  లేకుండా తెంచుకొనే కాంట్రాక్టు కాదు 

పెళ్లి అంటే సరైన కారణం లేకుండా, ఎటువంటి జంకు, గొంకు లేకుండా తెంచుకునే కాంట్రాక్టు కాదని నేటి తరం అర్థం చేసుకోవాలని మద్రాస్ హైకోర్టు హితవు చెప్పింది. సహజీవన సంబంధాలను ఆమోదించే గృహ హింస నిరోధక చట్టం, 2005 అమల్లోకి వచ్చిన తర్వాత పవిత్రతత అనే పదానికి అర్థం లేకుండా పోయిందని ఘాటుగా వ్యాఖ్యానించింది.

ఓ గవర్నమెంట్ వెటరినేరియన్ దాఖలు చేసిన కేసుపై విచారణ సందర్భంగా జస్టిస్ ఎస్ వైద్యనాథన్ ఇచ్చిన తీర్పులో ‘అహంకారం’, ‘అసహనం’ అనేవి చెప్పుల వంటివని భార్యాభర్తలు అర్థం చేసుకోవాలని సూచించారు. చెప్పులను ఇంటి బయట వదిలిపెట్టినట్లుగానే, అహంకారం, అసహనాలను కూడా వదిలిపెట్టాలని స్పష్టం చేశారు. లేనిపక్షంలో పిల్లలు బాధాకరమైన జీవితాలను జీవించవలసి వస్తుందని హెచ్చరించారు.

ప్రస్తుత కేసులో భర్త పశు సంవర్ధక, వెటరినరీ సర్వీసెస్ శాఖలో వెటరినేరియన్. ఆయన భార్య గృహ హింస కేసు పెట్టడంతో ఆయనను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ఆమె తనను వదిలిపెట్టినట్లు ఆరోపిస్తూ, ఆమె నుంచి తనకు విడాకులు మంజూరు చేయాలని విడాకుల దరఖాస్తును దాఖలు చేశారు. 

2020 ఫిబ్రవరి 18న కుటుంబ న్యాయస్థానం ఈ దరఖాస్తును అనుమతించింది. ఈ తీర్పు రావడానికి నాలుగు రోజుల ముందు ఆమె గృహ హింస చట్టం ప్రకారం కేసు పెట్టారు. దీంతో ఆయన సస్పెన్షన్‌కు గురయ్యారు. 

దీనిపై జడ్జి స్పందిస్తూ, ఆమె ఫిర్యాదు చేసిన సమయాన్ని పరిశీలించినపుడు, ఆమె విడాకులు మంజూరవుతుందని ముందుగానే ఊహించినట్లు అర్థమవుతుందని తెలిపారు. పిటిషనర్‌కు అనవసరమైన ఇబ్బందులు సృష్టించారని పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ భార్యకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి భర్తకు అవకాశం కల్పించే చట్టం లేదని గుర్తు చేశారు.  ఆయన సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ, ఆయనను 15 రోజుల్లోగా తిరిగి విధుల్లో చేర్చుకోవాలని సంబంధిత శాఖను ఆదేశించారు. 

రెండు నెలల క్రితం, ప్రస్తుత తరం వివాహాలను చాలా తేలికగా తీసుకొంటూ, చాలా చిన్న చిన్న కారణాలకు విడాకులు తీసుకొని విడిపోతున్నారని మద్రాస్ హై కోర్ట్ మరో కేసులో ఆవేదన వ్యక్తం చేసింది. వివాహ వ్యవస్థ ప్రాముఖ్యతను పట్టించుకోని అసహనమైన వ్యక్తుల కోసం కుటుంభ కోర్టుల సంఖ్య పెరుగుతున్నదని జస్టిస్ వి భవాని బెంచ్ గుర్తు చేసింది.