కరోనా నుండి కోలుకున్నా, టీకా తీసుకున్నా జీవితకాల రక్షణ 

కరోనా ఇన్‌ఫెక్షన్‌ నుంచి కోలుకున్న వారు లేదా కరోనా టీకా తీసుకున్న వారు ఈ వ్యాధి నుంచి జీవితకాల రక్షణ లభించవచ్చని తాజా అధ్యయనాలు పేర్కొన్నాయి. కరోనా మహమ్మారి కట్టడిపై ఇటీవల జరిపిన రెండు పరిశోధనలు ఈ విషయాన్ని వెల్లడించాయి. 
 
అయితే మరోసారి ఆ ఇన్‌ఫెక్షన్‌ బారిన పడకుండా ఇవి పూర్తిస్థాయిలో కాపాడతాయని నిర్ధారణగా చెప్పలేమని కూడా అధ్యయన శాస్త్రవేత్తలు తెలిపారు. అదేవిధంగా కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీలను దీర్ఘకాలం పాటు శరీరం ఉత్పత్తి చేయవచ్చన్న ఆశలకు ఈ పరిశోధనలు బలం చేకూర్చాయని చెప్పారు. 
 
అంతే కాదు కరోనా నుంచి కోలుకున్న వారిలో ఉత్పత్తి అయ్యే నిర్దిష్ట యాంటీబాడీలు స్వల్పకాలమే మనుగడలో ఉంటాయా?  ఈ వ్యాధి నివారణకు ఏటా లేదా ఆరు నెలలకొకసారి టీకా పొందాల్సిన అవసరం ఉంటుందా? అన్న ప్రశ్నలకు ఈ తాజా అధ్యయనాలు సమాధానాలు వెలిబుచ్చాయి. 
 
ఈ రోగ నిరోధక రక్షణ కనీసం ఏడాది పాటు కొనసాగుతుందని, కొందరిలో ఇది కొన్ని దశాబ్దాల పాటు కొనసాగవచ్చని పేర్కొన్నాయి. ఎముక మజ్జలోని రోగ నిరోధక కణాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు  కరోనాను నిర్వీర్యం చేసే యాంటీబాడీల ఉత్పత్తిలో ఎముక మజ్జకూ పాత్ర ఉన్నట్లు తేలడమే ఈ అంచనాలకు ప్రాతిపదిక అని తెలిపాయి. 
 
కరోనా వైరస్‌ను గుర్తుపెట్టుకొని, భవిష్యత్‌లోనూ అది దాడికి ప్రయత్నిస్తే వెంటనే తిప్పికొట్టే ”టి కణాల”నూ రోగ నిరోధక వ్యవస్థ ఉత్పత్తి చేస్తుందని కూడా తేలడం ఊరట కలిగిస్తోందన్నారు. 
 
కాగా, టీకా పొందిన వారితో పోలిస్తే కరోనా నుంచి కోలుకున్నవారికి భవిష్యత్‌ ఇన్‌ఫెక్షన్‌ను ఎదుర్కొనే సమర్ధత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. అయితే, ఇన్‌ఫెక్షన్‌ నుంచి కోలుకొని, ఆ తరువాత టీకా తీసుకున్న వారిలో రోగనిరోధక వ్యవస్థ చాలా మెరుగ్గా ఉంటుందని తెలిపారు.