
నిష్పాక్షిక అంతర్జాతీయ బహుధ్రువ ప్రాతినిధ్య వ్యవస్థ ఉండాలని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పిలుపునిచ్చారు. అన్ని దేశాల సార్వభౌమాధికారానికి సమానంగా గుర్తింపునివ్వడం, ఆయా దేశాల ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం ఈ వ్యవస్థకు ప్రాతిపదిక కావాలని బ్రిక్స్ సమావేశంలో మాట్లాడుతూ స్పష్టం చేశారు.
బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా దేశాల బ్రిక్స్ గ్రూప్‌నకు ప్రస్తుతం భారత దేశం అధ్యక్షత వహిస్తోంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ కూడా పాల్గొన్న నేపథ్యంలో జైశంకర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2020లో భారత్-చైనా సరిహద్దు సంఘర్షణల పూర్వ రంగంలో ఇటువంటి వ్యవస్థ కోసం భారత్ పిలుపునివ్వడం కీలక పరిణామం.
భారత దేశ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జైశంకర్ మాట్లాడుతూ నిష్పాక్షిక అంతర్జాతీయ బహుధ్రువ ప్రాతినిధ్య వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పారు. అన్ని దేశాల సార్వభౌమాధికారానికి సమానంగా గుర్తింపునివ్వడం, ఆయా దేశాల ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం ఈ వ్యవస్థకు ప్రాతిపదిక కావాలని సూచించారు.
బ్రిక్స్ 15వ వార్షికోత్సవం సమయంలో దానికి అధ్యక్షత వహించే అవకాశం భారత దేశానికి లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రులు తొలిసారి 2006లో న్యూయార్క్‌లో సమావేశమైన సంగతిని గుర్తు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా దూరం ప్రయాణించామని చెబుతూ ఇన్నేళ్ళ నుంచి బ్రిక్స్ దేశాలకు మార్గదర్శకత్వం వహించే సిద్ధాంతాలు నిలకడగా, స్థిరంగా ఉన్నాయని పేర్కొన్నారు.
అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్య సమితి చార్టర్ ఆధారంగా నిష్పాక్షిక అంతర్జాతీయ బహుధ్రువ ప్రాతినిధ్య వ్యవస్థ ఏర్పడాలని భారత దేశం కోరుకుంటోందని జైశంకర్ తెలిపారు. ఈ వ్యవస్థ అన్ని దేశాల సార్వభౌమాధికారాన్ని గుర్తించాలని, అన్ని దేశాల ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అటువంటి నిష్పాక్షిక, న్యాయ, సమ్మిళిత, ధర్మబద్ధ ప్రాతినిధ్య వ్యవస్థ కోసం భారత దేశం కృషి చేస్తోందని చెప్పారు.
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడుతూ, కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనం భారత దేశంలో తీవ్రంగా ఉందని, దీనిని అధిగమించేందుకు భారత దేశానికి చైనాతో సహా బ్రిక్స్ దేశాలన్నీ సహకరిస్తాయని తెలిపారు. భారత దేశానికి అవసరమైన మేరకు అన్ని వేళలా సహకరిస్తామని చెబుతూ ఈ మహమ్మారి నుంచి భారత దేశం గట్టెక్కగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.
రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవరోవ్ మాట్లాడుతూ, ప్రమాదకరమైన కోవిడ్ వైరస్‌తో పోరాటంలో భారత దేశానికి సహాయపడతామని హామీ ఇచ్చారు.
దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి గ్రేస్ నలేది పండోర్ టీకా విషయంలో సాంకేతిక బదిలీ, ఉత్పత్తిపై సహకారం, ఒప్పందం అవసరమని చెప్పారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండే వరకు మనం కూడా సురక్షితంగా లేమని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. టీకా విషయంలో ప్రపంచ అంతరం చాలా పెద్దదిగా ఉన్నదని, ఈ సమయంలో దానిని తగ్గించుకోవాల్సిన అవసరం ఉన్నదని స్పష్టం చేశారు.
More Stories
ప్రధాని మోదీకి అత్యున్నత సైప్రస్ పురస్కారం
రెండుసార్లు ట్రంప్‌ను చంపేందుకు ఇరాన్ యత్నం
అమెరికాలో ట్రంప్‌కు వ్యతిరేకంగా వీధుల్లోకి లక్షలాది జనం