7 నుంచి ఆనందయ్య మందు పంపిణీ!

నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య మందును సోమవారం (ఈనెల 7వ తేదీ) నుంచి పంపిణీ చేసే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ చక్రధరబాబు తెలిపారు. రానున్న నాలుగైదు రోజుల్లో ఆనందయ్య మందు పంపిణీకి శ్రీకారం చుడతామని  ప్రకటించారు. మందు పంపిణీపై విధి విధానాలను ఖరారుచేయడం కోసం మంగళవారం ఆనందయ్యతో కలెక్టర్‌ చక్రధర్‌బాబు, ఎస్పీ భాస్కర్‌భూషణ్‌, ఇతర శాఖల ముఖ్య అధికారులు, సర్వేపల్లి వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి సమావేశం అయ్యారు.

తాము చెప్పేవరకు ఆనందయ్య మందు కోసం ఎవరూ కృష్ణపట్నం రావద్దని ప్రజలకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ‘‘మందు తయారీకి అవసరమైన మూలికలు, ఇతర పదార్థాలు సిద్ధం చేసుకోవడానికి ఆనందయ్యకు ఐదు రోజుల సమయం పడుతుంది. బహుశా సోమవారం నుంచి (7వ తేదీ) మందు పంపిణీ మొదలవుతుంది” అని చెప్పారు.

అన్ని జిల్లాలు, ముఖ్య పట్టణాల్లోని ప్రత్యేక కౌంటర్ల ద్వారా ప్రజలకు మందు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. ఇతర రాష్ట్రాలకు కూడా అందేలా చర్యలు తీసుకొంటున్నాం. దూరప్రాంతాల వారు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే వారికి కొరియర్‌, స్పీడ్‌ పోస్టు ద్వారా మందులు అందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.

దీనికోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ తయారు చేస్తున్నామని చెబుతూ  తొలుత పాజిటివ్‌ వచ్చిన వారికే మందు పంపిణీలో తొలి ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. పాజిటివ్‌ లేని వారికి ఇచ్చే పీ రకం మందును రెండో ప్రాధాన్యతగా తయారు చేసి పంపిణీ చేస్తామని తెలిపారు.  మందుల పంపిణీలో పోలీస్‌, రెవెన్యూ యంత్రాంగాల సేవలు వినియోగించుకుంటామని పేర్కొన్నారు. కొవిడ్‌ నిబంధనలకు లోబడి ఆనందయ్య మందు పంపిణీ జరుగుతుందని, దీనికి ప్రజలు సహకరించాలని కలెక్టర్‌ కోరారు. 

కాగా, కృష్ణపట్నంలో మందు తయారీకి అవసరమై ఏర్పాట్లు ఊపందుకున్నాయి. వనమూలికల సేకరణ పెద్ద ఎత్తున జరుగుతోంది. తేనె ఇతర పదార్థాలను పెద్దఎత్తున కొనుగోలు చేస్తున్నారు.