గత ఏడాది జూన్‌లో లడాఖ్‌లోని గాల్వన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో చైనా సైనికులు ఎక్కువ మంది చనిపోయారని అంటూ తమ దేశాన్ని తప్పుబట్టిన బ్లాగ్లర్ కు చైనాలో 8 నెలల జైలు శిక్ష విధించారు.
ఆ దాడిలో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందారు. ఆ నాటి ఘటనలో నలుగురు సైనికులు చనిపోయినట్లు ఫిబ్రవరిలో చైనా కూడా ప్రకటించింది. వారిని అమర వీరులు, హీరోలు అంటూ కీర్తించింది. అయితే చైనాలోని ఓ పాపులర్ బ్లాగర్ మాత్రం తమ దేశ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు.
గాల్వన్ ఘర్షణలో ఎక్కువ మంది సైనికులు మరణించారని, ప్రభుత్వం మాత్రం నలుగురే అని చెబుతోందని అతను తన బ్లాగ్‌లో రాశాడు. క్వియు జిమింగ్ అనే బ్లాగర్ చేసిన కామెంట్లు చైనా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాయి. ట్విట్టర్ లాంటి వీబో సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో అతనికి 25 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
అమరవీరులపై అనుచిత కామెంట్లు చేశారంటూ ఆ బ్లాగర్‌కు శిక్షను ఖరారు చేశారు. మంగళవారం నాన్‌జింగ్ నగరంలోని కోర్టు అతనికి 8 నెలల జైలు శిక్షను విధించింది. జాతీయ హీరోలు, అమరవీరులను కించపరిస్తే వారికి జైలు శిక్షను అమలు చేసే కొత్త నేర చట్టానికి ఇటీవలే చైనా ఆమోదం తెలిపింది.
ఆ చట్టం ప్రకారం శిక్ష పడిన మొదటి వ్యక్తి ఇతనే. క్వియు జిమింగ్ తన సోషల్ మీడియా పోస్టుల్లో అధికారులు చెప్పిన లెక్కల కన్నా ఎక్కువ సంఖ్యలో సైనికులు మరణించి ఉంటారని పేర్కొన్నారు. అంతేకాదు ఘర్షణలో పాల్గొన్న ఓ కమాండింగ్ ఆఫీసర్ ప్రాణాలు దక్కించుకున్నాడని, హైయ్యస్ట్ ర్యాంక్ ఆఫీసర్ కావడం వల్ల అతను సజీవంగా ఉన్నట్లు తన బ్లాగ్‌లో అతను ఆరోపించాడు.
38 ఏళ్ల క్వియును ఫిబ్రవరిలోనే అరెస్టు చేశారు. వీబో.. అతని సోషల్ మీడియా అకౌంట్‌ను బ్యాన్ చేసింది. అమరవీరులను అవమానపరిచినట్లు కోర్టు ముందు క్వియు అంగీకిరించాడు. ఫిబ్రవరి నుంచి గాల్వన్ ఘటనపై అనుచిత కామెంట్లు చేసిన ఆరుగురిని ఇప్పటి వరకు చైనా అరెస్టు చేసింది.
More Stories
అమెరికాలో భారత్ వ్యతిరేక సెనేటర్ తో రాహుల్ భేటీపై బిజెపి ఆగ్రహం
పాకిస్థాన్ తో చర్చలు జరిపే కాలం ముగిసింది
ఏపీలో స్పేస్ పార్క్ ఏర్పాటు చేయాలి