లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ పై ఎందుకు రభస!

కొద్ది రోజుల క్రితం, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో “సేవ్ లక్షద్వీప్” అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ ప్రారంభమైంది. అరేబియా సముద్రంలో ఉన్న భారత్ భూభాగం లక్షద్వీప్ లో గత కొన్ని నెలలుగా దాని మాజీ నిర్వాహకుడు దినేశ్వర్ శర్మ మరణించినప్పటి నుండి కొంత గందరగోళంకు గురవుతున్నది.

ఆ తరువాత, గుజరాత్ మాజీ ఎమ్మెల్యే ప్రఫుల్ పటేల్ ను కొత్త అడ్మినిస్ట్రేటర్ గా నియమించారు. అప్పటి నుండి, అతను తీసుకున్న చర్యల వల్ల లక్షద్వీప్‌లో తుఫాను ఏర్పడింది. లక్షద్వీప్ ఎంపి మొహమ్మద్ ఫైజల్ ఇండియా టుడేతో మాట్లాడుతూ పటేల్ తన “ఏకపక్ష మార్గాలతో” “భారతదేశ ప్రజాస్వామ్య స్వరూపాన్ని పాడు చేస్తున్నాడు” అని ఆందోళన వ్యక్తం చేశారు.

అతని ప్రకారం, కోవిద్-19 మహమ్మారి మొదటి వేవ్ సమయంలో  లక్షద్వీప్ ద్వీపాలు సున్నా కేసులతో కూడిన గ్రీన్ జోన్, ఎందుకంటే అప్పటి నిర్వాహకుడు దినేశ్వర్ శర్మ, ఎన్నికైన ప్రతినిధులు,  ప్రజల సమిష్టి కృషి కారణంగా. అయితే, బాధ్యతలు స్వీకరించిన వెంటనే పటేల్ ఈ విధానాన్ని మార్చారు.

ఫైజల్ ఇలా అన్నాడు:

“మేము ఒక క్వారంటైన్  వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఒక ప్రత్యేక కార్యాచరణనును రూపొందించాము: లక్షద్వీప్‌ను సందర్శించాలనుకునే ఎవరైనా కొచ్చిలో ఏడు రోజుల క్వారంటైన్ లో ఉండి, ఆపై వారికి ఆర్టీపిసిఆర్ టెస్ట్ నెగిటివ్ వచ్చి ఉంటే, వారిని  లక్షద్వీప్‌లోకి ప్రవేశించడానికి అనుమతిస్తారు. అక్కడకు వచ్చిన తర్వాత వారు అదనముగా మరో వారం పాటు క్వారంటైన్ లో ఉండాలి.  ఇది వైరస్ వ్యాప్తిని నియంత్రించింది. ”

“మేము ఆర్థిక కార్యకలాపాలను కోరుకుంటున్నాము.  కాని క్వారంటైన్  వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలని మేము డిమాండ్ చేసాము. కానీ అతను [పటేల్] అంగీకరించలేదు మరియు దానిని తొలగించలేదు, ఇప్పుడు లక్షద్వీప్ భారతదేశంలో అత్యధిక పాజిటివిటీ రేటును కలిగి ఉంది. ”

 

లక్షద్వీప్ జంతు సంరక్షణ నియంత్రణ 2021 ముసాయిదా చట్టంతో మరో వివాదం తలెత్తింది. ఆవులు, ఎద్దుల వధను నిషేధించాలని ఈ నిబంధన ప్రతిపాదించింది.  అయితే గొడ్డు మాంసం ద్వీపవాసుల ఆహారంలో పెద్ద భాగం. “ఈ చట్టం ప్రకారం అతను అమలు చేయడానికి ప్రయత్నిస్తే నేను ఏమి తినాలి? లేదా నేను తినకూడదు?. అతను నా రాజ్యాంగ హక్కును హరించుకుంటున్నాడు, ”అని ఫైజల్ వాపోయారు.

ఈ చట్టం స్థానికుల నుండి భూమిని స్వాధీనం చేసుకోవడానికి ఉద్దేశించినటు ఫైజల్ ఆరోపించారు. “ఇది అమలు జరిగితే , ద్వీపాలలో ఏ సామాన్యుల యాజమాన్యంలోని ఏదైనా భూమిని అభివృద్ధి ప్రయోజనాల కోసం తీసుకోవడానికి ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది” అని ఆయన చెప్పారు.

పటేల్ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఆల్కహాల్ లేని జోన్ లను, గ్రీన్ లైట్ మద్యం బార్లను తొలగించాలని కూడా ప్రతిపాదించారు.
96 శాతం ముస్లిం జనాభా ఉన్న కేంద్ర పాలిత భూభాగంలో ఇవన్నీ కలకలం సృష్టించాయి. ఈ ద్వీపంలో నివసించేవారిలో చాలా మంది జాతిపరంగా కేరళలోని మలయాళీ ప్రజలతో సమానంగా ఉంటారు. మలయాళం మాట్లాడతారు.

పటేల్ ప్రతిపాదించిన యాంటీ సోషల్ యాక్టివిటీస్ రెగ్యులేషన్ బిల్లు 2021, ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారిని పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హులుగా చేయడానికి ప్రతిపాదించిన చట్టాన్ని కూడా వీరు వ్యతిరేకిస్తున్నారు. “ఎన్నికైన ప్రతినిధులతో చర్చించకుండా ఈ ముసాయిదా నోటిఫికేషన్లు తీసుకువస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం” అని ఫైజల్ విమర్శించారు. 

 
పర్యాటక కేంద్రంగా లక్షద్వీప్ 
 
మరోవైపు, సందడిగా ఉన్న పర్యాటక కేంద్రంగా ఉద్భవించగల ద్వీపాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ప్రతిపాదనలను పటేల్ సమర్థించారు. “త్వరలోనే ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు లక్షద్వీప్ కోసం ప్రకృతిని ఆస్వాదించడానికి వెళతారని, అది మాల్దీవులు భారతదేశంగా మారుతుందని మేము ఆశిస్తున్నాము” అని పటేల్ తెలిపారు. 
 
పైగా, కేంద్ర ప్రభుత్వం మహిళలు, యువత, పేదలు ఎక్కువగా ప్రయోజనం పొందే విధానాలపై దృష్టి సారించినట్లు ఆయన చెప్పారు.  అగట్టి విమానాశ్రయంను ఆధునీకరించి, వాటర్ విల్లాస్ అభివృద్ధి చేస్తారని, పర్యాటకాన్ని ప్రోత్సహిస్తామని ఆయన వివరించారు. అభివృద్ధి కోసం మత్స్య, ఆరోగ్యం, విద్యారంగంలో ప్రభుత్వం తీసుకున్న ఇతర చర్యలకు సంబంధించిన జాబితాను ఆయన తయారు చేశారు.

ఈ కేంద్ర పాలిత ప్రాంతంను ఇప్పటి వరకు పాలించిన వారిలో ఎక్కువ మంది మైనారిటీ కార్డును వాడుకున్నారని, అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని ఆయన పేర్కొంటూ,  తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. 
 

గొడ్డు మాంసం నిషేధంపై ప్రస్తావిస్తూ చాలా భారతీయ రాష్ట్రాలు ఆవు మాంసం అమ్మకాలను అనుమతించవని,గుర్తు చేశారు. లక్షద్వీప్‌లో దీనిని అమలు చేస్తే ఎటువంటి హాని ఉండదని చెబుతూ, రాజ్యాంగంలోని 48 వ అధికరణమే ఆవు వధను నిషేధించాలని ప్రభుత్వాన్ని నిర్దేశిస్తుందని చెప్పారు. .

కొత్త పంచాయతీ ఎన్నికల నిబంధనలను ప్రస్తావిస్తూ అవి  దీర్ఘకాలంలో మహిళల సాధికారతను బలోపేతం చేస్తాయని, ఈ విషయంపై ప్రజల అభిప్రాయం కోరేందుకు చట్టం ముసాయిదా మాత్రమే విడుదల చేశామని తెలిపారు. ఈ చట్టంలో  మొత్తం పంచాయతీ సీట్లలో 50 శాతం మహిళా అభ్యర్థులకు కేటాయించే నిబంధనను పొందుపరిచామని, దానితో ప్రజాస్వామ్య ప్రక్రియలో వారి భాగస్వామ్యం పెరుగుతుందని వివరించారు.

ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారిని పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయకుండా నిషేధించిన పటేల్, చట్టం అమల్లోకి రాకముందే, ఇప్పటికే ఇద్దరు పిల్లలున్న వారికి ఇది వర్తించదని పటేల్ స్పష్టం చేశారు. ఇటువంటి నిబంధనను భారతదేశంలోని అనేక రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని, వాటిని కోర్టులు కూడా  సమర్థించాయని గుర్తు చేసారు.

నేర కార్యకలాపాలను, ముఖ్యంగా పెద్ద ఎత్తున గంజాయి అక్రమ రవాణా, అక్రమ మద్యం వ్యాపారం సంబంధిత నేరాలను తనిఖీ చేయడానికి సంఘ వ్యతిరేక చర్యల నియంత్రణ బిల్లు 2021 లేదా గూండా చట్టం తీసుకువచ్చినట్లు పటేల్ చెప్పారు. “లక్షద్వీప్లో నేరం లేదని చెప్పేవారు నిజం చెప్పడం లేదు” అని ఆయన పేర్కొన్నారు.

పర్యాటక కేంద్రంలో ఇప్పటికే అక్రమంగా మద్యం అమ్మకాలు ప్రబలంగా ఉన్నాయని, దీనిని అనుమతించడం వల్ల అక్రమ వాణిజ్యాన్ని నిలిపివేయడమే కాకుండా, ఆదాయం పెంచుకోవడానికి, పర్యాటక రంగంలో భద్రతకు సహాయపడుతుందని పటేల్ చెప్పారు. 

 

లక్షద్వీప్ అభివృద్ధికి మరో కారణం ఉంది. సమీప దేశాలు శ్రీలంక, మాల్దీవులలో పెరుగుతున్న చైనా ఆక్రమణల మధ్య హిందూ మహాసముద్రంలో ఈ భూభాగం భారీ వ్యూహాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉంది. “లడఖ్, ఈశాన్య రాష్ట్రాలలో అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భారతదేశం వ్యూహాత్మకంగా ప్రాధాన్యత ఇస్తున్న కారణాలతోనే  ఇటీవలి కాలంలో ఈ ప్రాంతాలలో పర్యాటక ప్రోత్సాహాన్ని కూడా ప్రారంభించింది” అని ఇండియా టుడే కథనంలో ప్రభాష్ కె దత్తా చెప్పారు.

ఇదిలావుండగా, కేరళకు చెందిన పలువురు వామపక్ష, కాంగ్రెస్ ఎంపీలు పటేల్‌ను పదవి నుంచి తొలగించాలని, ఆయన ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కాంగ్రెస్ నాయకులు ప్రియాంక గాంధీ వాద్రా, రాహుల్ గాంధీ, ఫుట్ బాల్ ఆటగాడు సి.కె.వీనీత్, నటుడు పృథ్వీరాజ్ సుకుమార్ ప్రఫుల్ పటేల్ కు వ్యతిరేకంగా ఉన్నారు.

 
వీరంతా వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా కేవలం రాజకీయ ప్రయోజనాలకోసమే ఆరాట పడుతున్నట్లు కనిపిస్తున్నది. నిర్మానుష్యంగా ఉండే పలు లక్షద్వీప్ ద్వీపాలపై ఇప్పటికే విదేశీ అక్రమ ఆయుధాల సరఫరా, స్ముగ్లర్ల కన్నులు పడ్డాయి. వాటిని స్థావరాలుగా చేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవంక డ్రాగన్ కన్ను పడే అవకాశం ఉంది. అందుకనే ఈ ప్రాంతం భద్రత దేశానికి ఆయువుపట్టు కాగలదు.