గచ్చిబౌలి పోలీసులపై రఘురామ కేసీఆర్ కు ఫిర్యాదు 

గచ్చిబౌలి పోలీసులపై రఘురామ కేసీఆర్ కు ఫిర్యాదు 

ఒక ప్రజాప్రతినిధిని అరెస్టు చేసే సమయంలో పొరుగు రాష్ట్ర పోలీసులు అనుసరించాల్సిన విధివిధానాలు, మార్గదర్శకాలను గచ్చిబౌలి స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌వో) పట్టించుకోలేదని ఫిర్యాదు చేస్తూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు ఓ లేఖ రాశారు. ఆ అధికారిపై  క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన ఆ లేఖలో కోరారు. 

పలు సందర్భాల్లో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు, పోలీసు మాన్యువల్‌ చెబుతున్న మార్గదర్శకాలను అందులో వివరించారు. ఈనెల 14న తన అరెస్టు సమయంలో చోటుచేసుకున్న నిబంధనల ఉల్లంఘనను వివరిస్తూ  కేసీఆర్‌కు శనివారం 8 పేజీల లేఖ రాశారు.

‘‘నాపై ఏపీసీఐడీ సూమోటోగా కేసు నమోదు చేసింది. ఈ  కేసును గుంటూరు సీఐడీ అడిషనల్‌ ఎస్పీ విజయపాల్‌ నేతృత్వంలో పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 14వ తేదీన హైదరాబాద్‌ గచ్చిబౌలి బౌల్డర్‌హిల్స్‌లోని నా నివాసమైన 74వ నంబర్‌ విల్లాకు ఒక బృందం వచ్చింది. నన్ను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసేందుకు వచ్చినప్పుడు గచ్చిబౌలి స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ కనీస పోలీసు మాన్యువల్స్‌ను కూడా పట్టించుకోలేదు” అంటూ విచారం వ్యక్తం చేశారు. 

ఎంపీగా ఉన్న తన అరెస్టుకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని కూడా పరిశీలించలేదని, ఏపీసీఐడీ  నుంచి ట్రాన్సిట్‌ రిమాండ్‌ ఆర్డరు తీసుకోలేదని, అసలు ఎఫ్‌ఐఆర్‌ ఉందో లేదో కూడా పరిశీలించలేదని ధ్వజమెత్తారు. తనను అరెస్టు చేసే ముందు తన  ఆరోగ్య పరిస్థితిపై  స్థానిక ఆసుపత్రిలో పరీక్షలు చేయించాలన్న నిబంధనను కూడా పట్టించుకోలేదని వాపోయారు.

తనను అదుపులోకి తీసుకుంటున్న సమయంలో ఏపీసీఐడీ న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా వ్యవహరించేలా చూడాల్సిన బాధ్యతనూ విస్మరించారని ఆరోపించారు. తనను కారులోకి నెట్టేస్తున్నా గచ్చిబౌలి ఎస్‌హెచ్‌ఓ స్పందించలేదని చెప్పారు. రాజ్యాంగ హక్కులను కాపాడడంలో భాగంగా తన అరెస్టుకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, అది కూడా తీసుకోలేదని రఘురామ తన లేఖలో వివరించారు.

తనను అరెస్టు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దును దాటేముందు ప్రస్తుతమున్న నిబంధనలు, మార్గదర్శకాల మేరకు తెలంగాణ ప్రభుత్వ అనుమతిని ఏపీసీఐడీ తీసుకోలేదని ఆరోపించారు. తెలంగాణ పోలీసులు ‘రూల్‌ ఆఫ్‌ లా’ను అమలుచేసేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌ను కోరారు. సీఐడీ అడిషనల్‌ ఎస్పీ విజయపాల్‌ బృందంతోపాటు తన నివాసానికి వచ్చిన గచ్చిబౌలి పోలీసు సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన అభ్యర్థించారు.