జూలై చివరి నాటికి రోజుకు కోటి టీకాలు

దేశంలో జూలై చివరి నాటికి రోజు కోటి డోసులు వ్యాక్సిన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం భావిస్తోందని ఎయిమ్స్‌ చీఫ్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా తెలిపారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భారత్‌ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే దేశంలో టీకాల ఉత్పత్తిని పెంచాలని చెప్పారు. అలాగే వ్యూహాత్మకంగా విదేశాల నుంచి వీలైనన్ని వ్యాక్సిన్లు తెప్పించుకోవాలని సూచించారు. 

పలువురితో కాకుండా ఒక్కరితోనే చర్చలు జరిపేందుకు తయారీదారులు ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. ఢిల్లీ, పంజాబ్‌తోపాటు పలు రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్లను నెరవేర్చేందుకు ఔషధ కంపెనీలు నిరాకరించిన నేపథ్యంలో ఎయిమ్స్ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వంతో మాత్రమే చర్చలు జరిపేందుకు వారు సుముఖంగా ఉన్నట్లు గులేరియా గుర్తుచేశారు.

టీకాలను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి రాష్ట్రాలకు సరఫరా చేయాలని చెప్పారు. గర్భిణులకు సైతం టీకాలు వేయాలని సూచించారు. గర్భిణుల్లో అనారోగ్య సమస్యలతోపాటు మరణాల రేటు అధికంగా ఉందని, ఈ మేరకు వారికి త్వరగా వ్యాక్సిన్ వేయాలని సూచించారు. కొవాగ్జిన్‌ టీకా అయితే గర్భిణులకు ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. 

మల్టీ విటమిన్లు, జింక్ సప్లిమెంట్స్ వంటి రోగనిరోధక శక్తి బూస్టర్ల వాడకంపై స్పందిస్తూ  అవి ఎలాంటి హాని చేయవని స్పష్టం చేశారు. కానీ, వాటిని ఎక్కువ కాలం తీసుకోకూడదని హెచ్చరించారు. బదులుగా ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని, సహజ వనరుల నుంచి విటమిన్లు పొందాలని సూచించారు.

కాగా, దేశంలో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భారత్‌ మరో మైలురాయిని అధిగమించింది. ఇప్పటి వరకు 21 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. శనివారం నాటికి వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ 134వ రోజుకు చేరగా, ఒకే రోజు 28,09,436 టీకాలు వేసినట్లు పేర్కొంది. 

ఇందులో 25,11,052 మంది లబ్ధిదారులకు మొదటి, మరో 2,98,384 మంది లబ్ధిదారులకు రెండో మోతాదు అందజేసినట్లు చెప్పింది. 18-44 సంవత్సరాల మధ్య వయస్సున్న 14,15,190 మందికి మొదటి మోతాదు, మరో 9,075 మందికి రెండో మోతాదు అందజేసినట్లు తెలిపింది.

మూడో దశ వ్యాక్సినేషన్ ప్రారంభమైన నుంచి దేశవ్యాప్తంగా 1,82,25,509 మందికి మొదటి మోతాదు అందిందని చెప్పింది. బిహార్‌, ఢిల్లీ, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లో 18-44 వయస్సున్న వారికి పదిలక్షలకుపైగా వ్యాక్సిన్లు వేసినట్లు పేర్కొంది. సాయంత్రం 7 గంటల వరకు అందిన తాత్కాలిక సమాచారం మేరకు దేశంలో మొత్తం 21,18,39,768 మోతాదులు అందించినట్లు చెప్పింది.