అల్లోపతి ఆస్థిత్వాన్ని ప్రశ్నిస్తున్న ఆనందయ్య 

డా. శ్రీనివాసులు దాసరి, ఐ ఎ ఎస్ (రిటైర్డ్)
 
కరోనా కష్ట కాలంలో కృష్ణపట్నం ఉదంతం భారతీయ వైద్య విధానాల విశిష్టతను చాటి చేప్పిందనే చెప్పవచ్చు.సంప్రదాయ వైద్య విలువల్ని ప్రపంచ వ్యాప్తంగా గుర్తించేలా చేసింది కూడా. అల్లోపతిక్ వైద్యం అస్థిత్వాన్ని ప్రశ్నించే విధంగా డా. ఆనందయ్య రూపంలో దేవుడు మనల్ని మేలుకొల్పాడు.
ఈ సందర్భంగా దయ చేసి దేశీ వైద్యుల్ని ‘నాటు వైద్యులుగా’ గా సంభోదించకండి. మల్టీ నేషనల్ కార్పొరేట్లు తమ స్వప్రయోజనాల కు ప్రచారం లోకి తెచ్చిన ఈ పద ప్రయోగాన్ని భారతీయడన్నవాడు ఎవడైనా ఉచ్చరించే సందర్భం రాకూడదు. ఇంతవరకు చేసిన తప్పును సరి దిద్దుకొండి. దేశీ వైద్యుల ప్రతిభను గుర్తించి,వారి నిపుణతకు పట్టం కట్టండి.
వంశ పారంపర్యంగా వస్తున్న వృత్తి విద్యను కొనసాగిస్తూ, ఏ లాభాపేక్ష లేకుండా సమాజ సేవలో తరిస్తున్న దేశీ వైద్యుడు అనందయ్య ను డాక్టర్ గా సంభోదించటానికి నోరు రాని ఈ సభ్య సమాజం ఆతన్ని ఒక దోషిగా నిలబెట్టటానికి ప్రయత్నించింది. అందుకు మనందరం సిగ్గు పడాలి. మరీ ముఖ్యంగా పైత్యం ప్రకోపించిన మీడియా కథనాలు నేటివ్ వైద్య విద్యను,సంప్రదాయాలను కించ పరిచే విధంగా ఉన్నాయి.
 
దైవ దత్తం గా కొలిచే మన ‘పంచమ వేదాన్ని’ అపహాస్యం చేసే మిడి మిడి జ్ఞానులకు పుట్టగతులు ఉండవు. సంప్రదాయ వైద్యము,జానపద వైద్యము,ప్రకృతి వైద్యము వృత్తిగా గిరిజన,హరిజన వైద్యులు తర తరాలుగా అందిస్తున్న సేవలు మనకు సంక్రమించిన దేశీయ సంపద.సామాజిక ఉమ్మడి ఆస్తి.జాతీయ వారసత్వం కూడా.దేశ ప్రజానీకాన్ని అంతు చిక్కని రోగాలు, రొష్టుల బారి న పడకుండా కాపాడిన ఆదిమ జాతి తెగలు వీరు.
 
గురు శిష్య పరంపర ను కొనసాగిస్తు వారి వారి వృత్తి ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా ఆరాధించే ఈ వైద్య విద్వాన్లు మన జాతిరత్నాలు.వీరందరూ బడుగు వర్గాల వారు. భేషజం లేని అయ్యవార్లు. .ఆకులు, అలములు, దేశీయ ద్రవ్యాల కలయిక ఏ మోతాదులో ఏయే వ్యాధులు కు ఇవ్వాలో ఆచరణలో చూపిన వైద్య నిపుణులు వీరు.
 
ప్రపంచ ఆరోగ్య సంస్థల ఆమోదానికి నోచుకోని ఈ వైద్య శిఖా మణుల్ని దేశీ సంస్థలు గుర్తించాల్సిన అవసరాన్ని డా.. ఆనందయ్య లాంటి వారు ఈ సంఘటన మాద్యం ద్వారా గుర్తు చేశారు. అలాగే సాంప్రదాయ వైద్యులకు ‘ఆయూష్’ సంస్థలే తగిన శక్తి కేంద్రాలు. ఐసీఎంఆర్ కాదు. ఆంగ్లేయ పరిశోధనా సంస్థలు అసలే కాదు. ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియో, ప్రకృతి వైద్య ఇత్యాది జ్ఞానాన్ని సమన్వయ పరిచి చైనా దేశంలో లాగా ఆంగ్లేయ వైద్య విధానాల డొల్ల తనాన్ని బహిర్గతం చేయాల్సిన అవసరం ఈ నేపథ్యంలో గుర్తించి ఆచరణ లో చూపాలి.
 
తగు రీతిగా ఆయుష్ ప్రమాణాలను మెరుగు పరిచే విధంగా ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలి. పేటెంట్ రైట్స్ పేరుతో దేశీ అధ్యయనాన్ని విదేశీ సంస్థల గుత్తాిది పత్యానికి లోను కాకుండా చూడాలి.ఇప్పటికే భారతావని మోసపోయింది.
గుడ్డిలో మెల్లగా ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వ ఆయుష్ పరిశోధనా సంస్థలు దేశీయ ఔషధాలను ఎలా ఇవ్వాలో దేశీయ వైద్యులకు నిర్దేశాలు జారీ చేయటం హర్షణీయం.తిప్ప తీగ బిళ్ళలు,అశ్వగంధ గోళీలు, ఆయుష్ 64, శొంఠి, వాము, కర్పూరము, పిప్పిలి వంటి ద్రవ్యాలను ఆయుష్ సంస్థలు ప్రోత్సహిస్తున్నాయి.
 
ఈ దిశగా నేటివ్ వైద్యులు శ్రమించి కనుగొన్న ఔషధాలకు రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాల ఆధీనంలో పనిచేస్తున్న ఆయుష్ సంస్థలు ఆమోద ముద్ర వేసి సర్టిఫైడ్ మందులుగా మార్కెట్లోకి తెస్తే, దేశీయ వైద్య విధానానికి చట్ట బద్ధత కల్పించిన వారం అవుతాము.
ఎన్నో క్లిష్టమైన క్యాన్సర్ కేసుల్ని ఆయుర్వేదం బతికించింది. అలాగే ప్రాణ వాయువులు అందని అమర నాథ్ యాత్రికిల్ని కాలినడకన నడిపించిన సంఘటన 2015 లో దేశీ మందుల విలువను ఇనుముడింప జేసాయి.
 
శ్రీ శ్రీ శ్రీ రమణ మహర్షి తన జీవిత కాలము దేశీ వైద్య విధానమే ఊపిరిగా జీవించారు. అప్పటి మన ప్రియతమ ప్రధాని అటల్ జీ కేరళ కొట్టైకల్ ఆయుర్వేద చికిత్స తో ఊరట పొందటం మనందరికీ తెలిసిందే. నేటి సాధు సoతులు దేశీ మందులను జన బాహుళ్యాినికి అందు బాటులోకి తెస్తున్నారు. సంతోషం. ఈ నేపథ్యంలో ఆయుష్ వైద్యులు డా. అనందయ్య ను ఆదర్శంగా తీసుకుని విన్నూత్న టెక్నిక్స్ తో స్వదేశీ వైద్యానికి పూర్వ వైభవం ఆచరణ లో చూపాల్సిన సమయం ఇది.
 
దోపిడీ వ్యవస్థకు అనుకూలమైన అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలకు వత్తాసు పలుకుతున్న మాఫియా ను కూకటి వేళ్లతో పెకిలించి,మన సమాజాన్ని ఆనందంగా,ఆరోగ్యంగా తీర్చి దిద్దాల్సిన బాధ్యత మనందరి మీదా ఉంది .ప్రభుత్వాలు అందుకు సంపూర్ణ మద్దతు వెంటనే ప్రకటించాలి. ప్రజల మనో నిగ్రహాన్ని పరీక్షించడం మంచిది కాదు.