జూన్ చివ‌రి నాటికి 95 శాతం త‌గ్గ‌నున్న పాజిటివ్ కేసులు

జూన్ నెల చివ‌రినాటికి దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 95 శాతం త‌గ్గ‌నున్నాయి. మ‌హ‌మ్మారి క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగిస్తున్న వేళ ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌కు చెందిన ప‌రిశోధ‌కులు అభివృద్ధి చేసిన సూత్ర మ్యాథ‌మెటిక‌ల్ మోడ‌ల్ ఈ అంచ‌నా వేసింది. 

సూత్ర గ‌ణాంకాల ద్వారా.. తెలంగాణ రాష్ట్రంలోనూ జూన్ చివ‌రినాటికి పాజిటివ్ కేసుల సంఖ్య 90 శాతం ప‌డిపోనున్న‌ట్లు తెలిసింది. దేశంలో కోవిడ్ గ‌మ‌ణం ఎలా సాగుతోంద‌న్న దానిపై గ‌తంలోనూ సూత్ర స్ప‌ష్ట‌మైన అంచ‌నాలు చేసింది.

దేశంలో పాజిటివ్ కేసులు రోజు వారి స‌గ‌టు సంఖ్య 15 వేల‌కు చేరుకుంటుంద‌ని కూడా సూత్ర పేర్కొన్న‌ది. అయితే జూన్ చివ‌రి నాటికి ఈ స‌గ‌టు సంఖ్య న‌మోదు అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం ప్ర‌తి రోజు రెండు ల‌క్ష‌ల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ సంఖ్య 15వేల‌కు చేర‌డం అంటే ఇది చాలా పాజిటివ్ అంశ‌మే.

ఐఐటీ ఖ‌ర‌గ‌పూర్ ప‌రిశోధ‌కులు సూత్ర విధానంతో చేస్తున్న అంచ‌నాలు.. సింగ‌పూర్ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు చేస్తున్న అంచ‌నాలు దాదాపు ఒకేలా ఉంటున్నాయి. 131 దేశాల్లో క‌రోనా ప‌రిస్థితిపై సింగ‌పూర్ వ‌ర్సిటీ ఎలాంటి అభిప్రాయాల్ని వ్య‌క్తం చేసిందో.. అలాంటి అంచ‌నాల‌నే సూత్ర కూడా చెప్పుకురావ‌డం యాదృశ్చికం.  జూన్ 15 త‌ర్వాత ఇండియాలో కోవిడ్ ప్రళ‌యం 97 శాతం త‌గ్గే అవ‌కాశాలు ఉన్న‌ట్లు కూడా సింగ‌పూర్ వ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు అంచ‌నా వేయ‌డం గ‌మ‌నార్హం.
 
కాగా, గడిచిన 24 గంటల్లో భారత్ లో కొత్తగా 1,96,427 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ అధికారులు మంగళవారం ఉదయం తెలిపారు. మొదటిసారిగా ఈ మధ్య కాలంలో రెండు లక్షలకు దిగువకు చేరుకున్నాయి.  24 గంటల్లో 3,26,850 బాధితులు కరోనా నుంచి కోలుకోగా,3,511 మంది కరోనాతో బాధపడుతూ చనిపోయారని వారు వెల్లడించారు.