రఘురామను జైలుకు తరలించేందుకు పోలీసుల నిరీక్షణ!

సుప్రీంకోర్టు బెయిలు ఇచ్చినా సరే. ఎంపీ రఘురామ కృష్ణంరాజు సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రి నుంచి బయటికి రాగానే, మళ్లీ ఆయనను గుంటూరు జైలుకు తరలించాలని గుంటూరు పోలీసులు నిరీక్షిస్తున్నారా? ఎప్పుడు వస్తే అప్పుడు అదుపులోకి తీసుకునేందుకు వీలుగా ఆర్మీ ఆస్పత్రి బయటే గుంటూరు పోలీసులు సిద్ధంగా ఉన్నారా? 

అవునని రఘురామ తరఫు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. పైగా,  దీనిపై ఏకంగా గుంటూరు అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డికి సోమవారం కోర్టు ధిక్కరణ నోటీసులు కూడా జారీ చేశారు. సీఐడీ పెట్టిన ‘రాజద్రోహం’ కేసులో అరెస్టయిన రఘురామకు సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

 ‘‘రఘురామను ఎప్పుడు డిశ్చార్జి చేయాలో ఆర్మీ ఆస్పత్రి వైద్యులు సూచిస్తారు. డిశ్చార్జి అయిన తర్వాత 10 రోజుల్లోపై ష్యూరిటీ బాండ్లు సమర్పించాలి’’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంటే  రఘురామ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన వెంటనే, బెయిలు అమలులోకి వచ్చినట్లే అని న్యాయవాదులు చెబుతున్నారు.

 కానీ ఆయన్ను మళ్లీ గుంటూరు జైలుకు తరలించాలని పోలీసులు  భావిస్తున్నట్లు లాయర్లు తెలిపారు. దీనిపై గుంటూరు అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డికి ఎంపీ తరఫు న్యాయవాది కె. దుర్గాప్రసాద్‌ కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ చేశారు.

 ‘‘బెయిల్‌ బాండ్లు పొందేందుకు ఎంపీ రఘురామరాజును గుంటూరుకు తీసుకురావాల్సిందిగా మీరు ఎస్కార్టుకు సూచించినట్లుగా తెలిసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎంపీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన మరుక్షణం బెయిల్‌పై విడుదలైనట్లే. తర్వాత పది రోజుల లోపు బెయిల్‌ బాండ్లు సమర్పించవచ్చు. మీరిచ్చిన ఆదేశాలు సుప్రీంకోర్టు ఉత్తర్వులను ధిక్కరించేవిగా ఉన్నాయి’’ అని ఆ నోటీసులో పేర్కొన్నారు. 

కాగా, రఘురామ బెయిలుకు సంబంధించి ష్యూరిటీల దాఖలుకు అనుమతివ్వాలని ఆయన తరపు న్యాయవాదులు లక్ష్మీనారాయణ, చుక్కపల్లి రమే్‌ష సోమవారం మేజిస్ట్రేట్‌ను కోరారు. ఆర్మీ ఆస్పత్రి ఇచ్చిన డిశ్చార్జ్‌ సమ్మరీ ఇవ్వాలని మేజిస్ట్రేట్‌ అడిగారు.