కేంద్రానికి రూ 99 వేల కోట్లకు పైగా ఆర్‌బిఐ నిధులు 

కరోనా సంక్షోభ స‌మ‌యంలో నిధుల కొర‌త‌తో ఇబ్బందుల పాల‌వుతున్న కేంద్ర ప్ర‌భుత్వానికి అండ‌గా నిలిచేందుకు భార‌తీయ రిజ‌ర్వు బ్యాంకు (ఆర్బీఐ) ముందుకు వ‌చ్చించి. కేంద్రానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా భారీగా నిధులను తరలించనుంది. 
 
మొత్తం రూ.99,122 కోట్ల మిగులు ద్రవ్యాన్ని డివిడెంట్‌ రూపంలోబదిలీ చేయడానికి సెంట్రల్‌ బోర్డు ఆమోదం తెలిపిందని ఆర్‌బిఐ ప్రకటనలో తెలిపింది. గతంలో జులై నుండి జూన్‌ ఆర్థిక సంవత్సరంగా పరిగణించి బదిలీ చేయగా, ఈ ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్‌ నుండి మార్చిగా పరిగణించి బదిలీ చేయనుంది.
 
ఈ విధంగా ప్రకటించిన మిగులు జులై 2020 నుండి మార్చి 2021 వరకు అంటే 9 నెలల కాలానికి ఉంటుందని బ్యాంక్‌ తన ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఆధ్వర్యంలో జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయాలు జరిగాయి.

కరోనావ‌ల్ల భారీగా ఆదాయం ప‌డిపోవ‌డంతో ఇబ్బందుల్లో కేంద్ర ప్ర‌భుత్వం చిక్కుకున్న వేళ‌ డివిడెండ్ రూపంలో ఆర్బీఐ అందించే నిధులు ఉపయోగపడనున్నాయి. కరెన్సీ ట్రేడింగ్‌, బాండ్ల ట్రేడింగ్‌ నుంచి ఆర్బీఐకి భారీగా ఆదాయం ల‌భిస్తుంది. ఈ ట్రేడింగ్ ద్వారా వ‌చ్చే ఆదాయంలో కొంత త‌న కార్య‌ క‌లాపాల‌కు మిన‌హాయించుకుని మిగ‌తా నిధుల‌ను కేంద్ర ప్రభుత్వ ఆర్థిక అవసరాల కోసం అందజేస్తుంది. 

కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని తగ్గించేందుకు సెంట్రల్‌ బ్యాంకు తీసుకున్న విధాన చర్యలను, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ప్రపంచ, దేశీయ సవాళ్లను ఆర్‌బిఐ బోర్డు సమీక్షించింది. గత ఏడాది కూడా రూ. 57 వేల కోట్ల మిగులు నిధులను కేంద్రానికి ఆర్‌బిఐ ఇచ్చిన సంగతి విదితమే.