పాత సీట్ నుండి మమతా తిరిగి పోటీ

తాను నాయకత్వం వహిస్తున్న తృణమూల్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి తను ఓడిపోవడం మమతా బెనర్జీకి ఒకకంట కన్నీరు మరొక కంట ఆనందబాష్పాలు తెప్పించే విషయం. సహాయకుడుగా ఉంటూ అదను చూసుకుని బీజేపీలో చేరిన సువేందు అధికారికి గుణపాఠం చెప్పేందుకు ఆమె బెంగాల్ టైగర్‌లా ముందుకురికి నందిగ్రాం నుంచి పోటీ చేశారు. 
 
హోరాహోరీ పోరులో నాటకీయ పరిణామాల మధ్య ఆమె ఓడిపోయారు. వరుసగా మూడోసారి బెంగాల్ కోటలో పాగా వేసిన నాయకురాలికి ఆ ఓటమి బాధాకరమే. అయినప్పటికీ ఆమె బెంగాల్ సీఎం పదవి చేపట్టారు. నిబంధనల ప్రకారం మమత ఆరుమాసాల్లోపు అసెంబ్లీకి ఎన్నిక కావాలి. 
 
తన పాత నియోజకవర్గమైన కోల్‌కతాలోని భవానీపూర్ నుంచే ఆమె అసెంబ్లీకి పోటీచేయబోతున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆ స్థానంలో తృణమూల్ అభ్యర్థిగా శోభన్‌దేబ్ చటోపాధ్యాయ పోటీచేసి గెలిచారు. పార్టీ అధినేత్రి కోసం ఆయన ఆ సీటుకు రాజీనామా చేశారు. శుక్రవారం మధ్యాహ్నమే ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ బిమాన్ బంధోపాధ్యాయకు అందజేశారు. 
 
ప్రస్తుతం శోభన్‌దేబ్ వ్యవసాయ మంత్రిగా ఉన్నారు. ఆయన కూడా ఆరునెలల్లోగా మరో నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఎమ్మెల్యే కాని వ్యక్తి మంత్రి పదవి చేపడితే ఆరుమాసాల్లోగా ఎన్నిక కావాలి లేదా రాజీమానా చేయాలి అని రాజ్యాంగంలోని 164వ అధికరణం చెప్తున్నది.