బ్లాక్ ఫంగ‌స్ ఓ కొత్త స‌వాల్‌.. ప్రధాని హెచ్చరిక 

కోవిడ్‌19పై పోరాడుతున్న స‌మ‌యంలో.. బ్లాక్ ఫంగ‌స్ రూపంలో కొత్త స‌వాల్ ఎదురైంద‌ని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు.  ఆ వ్యాధిని అరిక‌ట్టేందుకు, అడ్డుకునేందుకు అన్ని చ‌ర్య‌లు తీసుకునే రీతిలో దృష్టి పెట్టాల‌ని పిలుపిచ్చారు. 
 
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కాశీలో ప్ర‌స్తుతం ఉన్న కోవిడ్ ప‌రిస్థితుల గురించి అక్క‌డి డాక్ట‌ర్లు, ప్యారామెడిక‌ల్ సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్ల‌తో ప్ర‌ధాని మోదీ ఇవాళ వీడియో స‌మావేశం నిర్వ‌హిస్తూ బ్లాక్ ఫంగ‌స్ నిరోధానికి ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని ప్ర‌ధాని కోరారు. క‌రోనా మ‌హ‌మ్మారి స‌మ‌సిపోయేవర‌కూ ప్ర‌జ‌లు సేద‌తీర‌రాద‌ని స్ప‌ష్టం చేశారు.

ఈ సమావేశంలో వారితో మాట్లాడుతూ ఆయన ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. కోవిడ్ మహమ్మారి సమయంలో వారు చేస్తున్న ధైర్యసాహసాలను కృషిని అభినందించారు. కోవిడ్ మహమ్మారికి ఎంతో మంది బలయ్యారని కన్నీళ్లు పెట్టుకున్నారు.

‘‘నిన్నమొన్నటి వరకు మన చుట్టు పక్కనే ఉన్న చాలా మందిని కోవిడ్ బలి తీసుకుంది. వారి కుటుంబాలకు నా సంతాపం వ్యక్తం చేస్తున్నాను. డాక్టర్లు, ఇతర మొదటి శ్రేణి కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి కోవిడ్‌పై పోరాటం చేస్తున్నారు’’ అని మోదీ అన్నారు.

వ్యాక్సినేష‌న్ వ‌ల్ల ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్ల‌కు ర‌క్ష‌ణ క‌లిగింద‌ని, వారంతా ప్ర‌జా సేవ చేస్తున్నార‌ని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్ర‌తి ఒక్క‌రికీ కోవిడ్ టీకాల‌ను ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు. జ‌హా బీమార్‌.. వ‌హా ఉప‌చార్ అన్న విధానాన్ని అవ‌లంబిస్తూ.. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి మందులు అందిస్తున్న తీరు ప్ర‌శంస‌నీయ‌మ‌ని కొనియాడారు. 
 
పండిట్ రాజ‌న్ మిశ్రా కోవిడ్ హాస్పిట‌ల్‌ను వార‌ణాసిలో ఏర్పాటు చేసిన తీరు అద్భుత‌మ‌ని ప్రశంసించారు. ఆ హాస్పిట‌ల్‌లో చాలా వేగంగా ఆక్సిజ‌న్ బెడ్లు, ఐసీయూ బెడ్ల‌ను పెంచిన‌ట్లు తెలిపారు. క‌రోనా క‌ట్ట‌డిలో వార‌ణాసి వైద్యులు, ఆరోగ్య సిబ్బంది సేవ‌ల‌ను ప్ర‌ధాని ప్ర‌శంసించారు. త‌క్కువ స‌మ‌యంలోనే న‌గ‌రంలో ఆక్సిజ‌న్ ప‌డ‌క‌లు, ఐసీయూ ప‌డ‌క‌ల‌ను పెద్ద సంఖ్య‌లో విస్త‌రించార‌ని కొనియాడారు.
 
కాగా, ఢిల్లీలో  ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులలో 197 బ్లాక్ ఫంగస్ వ్యాధి నమోదైందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. లక్షల్లో రోజువారీ కరోనా కేసులుండగా మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా బిహార్‌లో నలుగురు వ్యక్తుల్లో వైట్‌ ఫంగస్‌ బయటపడింది. వీరిలో ఓ డాక్టర్‌ ఉండడం గమనార్హం..!