కొత్త ప్రైవ‌సీ పాల‌సీని ఉప‌సంహ‌రించుకోవాల్సిందే

వాట్సాప్ త‌న కొత్త ప్రైవ‌సీ పాల‌సీని ఉప‌సంహ‌రించుకోవాల్సిందేన‌ని కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టంచేసింది. ఈ మేర‌కు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వాట్సాప్‌కు నోటీస్ పంపించింది. సమాచార సంబంధిత గోప్యత, సమాచార భద్రతల విలువలను బలహీనపరచేదిగా వాట్సాప్ కొత్త ప్రైవ‌సీ పాలసీ ఉన్న‌దని కేంద్రం పేర్కొన్న‌ది. తాజా నోటీస్‌పై స్పందించేందుకు వాట్సాప్‌కు కేంద్రం ఏడు రోజుల గడువు ఇచ్చింది. ఈ గడువులోగా స్పందించకపోతే చట్ట ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది.

యూరోప్‌, భారత దేశ యూజర్ల పట్ల వాట్సాప్‌ వ్యవహరిస్తున్న తీరును పరిశీలించి భారత యూజర్లపై వాట్సాప్‌ వివక్ష చూపుతున్న‌ట్లుగా భారత ప్రభుత్వం గుర్తించింది.భారతీయ యూజర్లపై అనుచితమైన నిబంధనలు, షరతులను విధించేందుకు ప్రస్తుత పరిస్థితిని ఉపయోగించుకోవడం వాట్సాప్ బాధ్యతారాహిత్యమని ప్రభుత్వం ఆగ్ర‌హం వ్య‌క్తంచేసింది.జాతీయ మీడియా కథనాల ప్రకారం, వాట్సాప్‌నకు నోటీసును మే 18న ఎంఈఐటీవై మంత్రిత్వ శాఖ జారీ చేసింది. ప్రైవసీ పాలసీ 2021ను ఉపసంహరించుకోవాలని ఈ నోటీసు ద్వారా తెలిపింది.

వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీపై దాఖలైన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు విచారణ జరుపుతోంది. ఈ పాలసీని ఉపసంహరించుకోవాలని లేదా 2021 జనవరి 4న విడుదల చేసిన అప్‌డేట్ నుంచి తప్పుకోవడానికి యూజర్లకు అవకాశం కల్పించాలని వాట్సాప్‌ను ఆదేశించే విధంగా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. ఈ వ్యాజ్యంపై స్పందిస్తూ హైకోర్టు ఫిబ్రవరిలో నోటీసులు జారీ చేసింది.

ఇదిలావుండగా, కొత్త ప్రైవసీ పాలసీని అంగీకరించడానికి యూజర్లకు విధించిన గడువు మే 15ను పొడిగించలేదని వాట్సాప్ మే 17న ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. యూజర్లను ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వాట్సాప్ తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ హైకోర్టుకు తెలిపారు.
ఈ కొత్త ప్రైవసీ పాలసీని యూజర్లు అంగీకరించకపోతే క్రమంగా వారి ఖాతాలను డిలీట్ చేస్తుందన్నారు. హైకోర్టు తదుపరి విచారణను జూన్ 3కు వాయిదా వేసింది.

ఇదిలావుండగా, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ, భారతీయుల హక్కులు, ప్రయోజనాలను కాపాడవలసిన ప్రధాన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పారు. చట్ట ప్రకారం అందుబాటులో ఉన్న వివిధ అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు.
ఈ మంత్రిత్వ శాఖ ఈ ఏడాది జనవరిలో కూడా వాట్సాప్‌నకు ఇటువంటి నోటీసును ఇచ్చింది. వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఆ సంస్థ గ్లోబల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విల్ కేథ్‌కార్ట్‌కు నోటీసు ఇచ్చింది.