తౌక్టే ప్రభావిత ప్రాంతాల్లో మోదీ ఏరియల్ సర్వే

తౌక్టే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఏరియల్ సర్వే నిర్వహించారు. గుజరాత్, డయ్యూ ప్రాంతాలను ఆయన సందర్శించారు. ఉణ, డయ్యూ, జఫరాబాద్, మహువలలో జరిగిన నష్టాన్ని స్వయంగా తెలుసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వివరించారు.

తౌక్టే తుపాను రెండు రోజుల క్రితం గుజరాత్‌లోని సౌరాష్ట్ర వద్ద తీరం దాటింది. మోదీ భావ్‌నగర్‌ నుంచి బయల్దేరి, ఉణ, డయ్యూ, జఫరాబాద్, మహువా ప్రాంతాల్లో ఈ తుపాను వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించారు. ఈ తుపాను బలహీనపడి దక్షిణ రాజస్థాన్, గుజరాత్‌లలో అల్పపీడనంగా మారింది. 

ఉదయ్‌పూర్‌నకు దక్షిణ-నైరుతి దిశలో సుమారు 30 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రానున్న 12 గంటల్లో ఇది క్రమంగా అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు రోజుల్లో ఈశాన్య దిశగా రాజస్థాన్ నుంచి ఉత్తర ప్రదేశ్ వైపు కదిలే అవకాశం ఉందని తెలిపింది. 

ఈ తుపాను వల్ల బుధవారం గుజరాత్‌, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. 

మోదీ నిర్వహించిన ఏరియల్ సర్వేలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా పాల్గొన్నారు. ఈ తుపాను కారణంగా సౌరాష్ట్ర తీరం నుంచి ఉత్తర గుజరాత్ వరకు  ఎక్కువ నష్టం జరిగింది.  మొత్తం మీద 13 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 16 వేల ఇళ్ళు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. తీర ప్రాంతాల్లో తీవ్ర నష్టం జరిగినట్లు తెలిపారు. చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకూలాయని, రోడ్లు ధ్వంసమయ్యాయని తెలిపారు. 

తౌక్టే తుపాన్‌ తీరం దాటుతున్న సమయంలో కొట్టుకుపోయిన ఓ బార్జ్‌ ముంబయి తీర ప్రాంతంలో మునిగిపోయింది. ఇందులో 261 మంది ఒఎన్‌జిసి ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 185 మందిని రక్షించగా…51 మంది ఆచూకీ కానరాలేదు. వీరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాగా 22 మంది మృతదేహాలను వెలికి తీశారు.

బుధవారం ఐఎన్‌ఎస్‌ కొచ్చి నౌక…మృతదేహాలతో పాటు రక్షించిన 188 మందిని ముంబయి నగర నౌకాశ్రయానికి చేరుకున్న ఓ వీడియోను ట్విట్టర్‌లో పిఆర్‌ఒ డిఫెన్‌ ముంబయి పంచుకుంది. ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా కూడా ఈ నౌకాశ్రయానికి చేరుకుంది. తేగ్‌, బెత్వా, బియాస్‌ నౌకలు, పి8ఐ విమానం, సీ హెలికాఫ్లర్లు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని ట్వీట్‌ చేసింది.