వ్యాక్సిన్ తయారీకి మరిన్ని కంపెనీలకు అనుమతులివ్వాలి

డిమాండ్‌కు తగినట్టు వ్యాక్సిన్ తయారీకి మరిన్ని కంపెనీలకు అనుమతించాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి సూచించారు. యూనివర్శిటీల వైస్‌ఛాన్స్‌లర్లతో వర్చువల్ సమావేశంలో గడ్కరి మాట్లాడుతూ, పేటెంట్ హోల్టర్లకు 10 శాతం రాయల్టీ చెల్లించే విధంగా లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌ను ఉత్పత్తి చేసేందుకు మరిన్ని కంపెనీలను అనుమతించేలా చట్టం తేవాలని ప్రధాని మోదీకి తాను విజ్ఞప్తి చేయనున్నట్టు చెప్పారు.

 వ్యాక్సిన్ సరఫరా కంటే డిమాండ్ ఎక్కువగా ఉంటే సమస్య తలెత్తుతుందని, ఒకటికి బదులు మరో 10 కంపెనీలకు లెసెన్స్‌లు ఇచ్చి తయారీకి అనుమతించాలని ఆయన పేర్కొన్నారు. తయారైన వ్యాక్సిన్‌ను దేశంలో సరఫరా చేసి, అప్పటికీ మిగులు ఉంటే ఎగమతులు చేయవచ్చని తెలిపారు. 

అత్మనిర్భర్ భారత్‌ను తాము కోరుకుంటున్నామని, దేశంలోని అన్ని జిల్లాలూ మెడికల్ ఆక్సిజన్ విషయంలో స్వయం సమృద్ధి సాధించాలని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఇప్పటికీ ముడి సరుకు దిగుపతిపై భారత్ ఆధారపడుతోందని చెప్పారు. కరోనా మమమ్మారి కాలంలో ప్రజలు పాజిటివ్ ఆలోచనలు, ఆత్మస్థైర్యం కలిగి ఉండాలని గడ్కరి సూచించారు.

అదే విధంగా కరోనా మహమ్మారి సమయంలో మృతదేహాల దహనం ఒక సమస్యగా పరిణమించడం పట్ల విచారం వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయ నిపుణులు తక్కువ ఖర్చుతో,  సాంకేతికత ఉపయోగించి మృతదేహాల దహనంకు విధానాలు సూచించాలని చెప్పారు. గంధపు చెక్కలకు బదులుగా డీజిల్, విద్యుత్, ఇథనాల్, బయోగ్యాస్ ఉపయోగించవచ్చని సూచించారు.

ఒక వ్యక్తిని దహనం చేయడానికి గంధపు చెక్కలకు రూ 3,000 ఖర్చు అవుతుందని, అదే డీసెల్ అయితే  రూ 1,600, ఎల్పీజీ అయితే రూ 1,200, విద్యుత్ అయితే రూ 750 నుండి 800 అవుతుందని వివరించారు. ఈ విషయంలో విశ్వవిద్యాయాలు పరిశోధనలు చేయాలని గడ్కరీ చెప్పారు. 

కాగా, టీకాలు గత గురువారమే కేంద్ర ప్రభుత్వం రోడ్ మ్యాప్ ప్రకటించడం గమనార్హం. మే నెలలో 7.30 కోట్ల డోస్ ల టీకాలు అందుబాటులోకి  వస్తాయని తెలిపింది. వాటిల్లో 1.27  కోట్లను రాష్ట్ర ప్రభుత్వాలే నేరుగా దిగుమతి చేసుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులు మరో 80 లక్షల టీకాలు సమకూర్చుకొంటున్నాయి.