హైదరాబాద్‌లో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాక్సిన్‌

అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ను హైదరాబాద్‌కు చెందిన మరో ఫార్మా సంస్థ ఉత్పత్తి చేయనుంది. బయోలాజికల్ ఈ సంస్థ తన సొంత వ్యాక్సిన్‌తో పాటు జేఅండ్‌జే వ్యాక్సిన్‌ను సైతం అందుబాటులోకి తీసుకురానుంది. 

ఈ మేరకు ఈ రెండు కంపెనీల మధ్య త్వరలోనే ఒప్పందం కుదరనుండగా.. ఈ విషయాన్ని జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ ధ్రువీకరించింది. కొవిడ్‌ వ్యాక్సిన్‌పై బయోలాజికల్ ఈ సంస్థతో కలిసి పని చేయనున్నట్లు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. సొంత టీకాతో పాటు జేఅండ్‌జే టీకాను సైతం ఉత్పత్తి చేయనున్నట్లు బయోలాటికల్‌ ఈ కంపెనీ ఎండీ మహిమా దాట్ల పేర్కొన్నారు.

ఈ రెండు టీకాలకు మౌలిక వసతులు, ప్లాంట్లు పూర్తిగా వేర్వేరుగా ఉంటాయని, ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా రెండింటిని ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. ఏటా 60 కోట్ల జేఅండ్‌జే టీకా డోసులను కాంట్రాక్ట్‌ పద్ధతిలో తయారు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఫిబ్రవరిలో ఆమె ప్రకటించింది. మరో వైపు సొంత టీకాను ఆగస్ట్‌ నుంచి 7.5 నుంచి 8 కోట్ల డోసులను తయారు చేయాలని బయోలాజికల్‌ ఈ భావిస్తోంది.

ఇప్పటికే రెండు వ్యాక్సిన్లు హైదరాబాద్‌లో ఉత్పత్తి అవుతున్నాయి. ఐసీఎంఆర్‌తో కలిసి భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ టీకాను అభివృద్ధి చేసింది. సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్‌ దేశంలో అత్యవసర వినియోగం కింద టీకా డ్రైవ్‌లో వినియోగిస్తున్నారు. మరో వైపు రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ను హైదరాబాద్‌కే చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ లాబోరేటరీతో తయారు చేస్తున్నది. జూన్‌ నాటికి డాక్టర్‌ రెడ్డీస్‌ సంస్థ ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి.