బెంగాల్ మంత్రులకు సిబిఐ కోర్ట్ బెయిల్… హైకోర్టు స్టే  

నారదా స్టింగ్ ఆపరేషన్ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు సోమవారం ఉదయం అరెస్ట్ చేసిన  ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యే, మాజీ మేయర్‌ లకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అరెస్ట్ చేసిన ఏడు గంటల్లోనే వారికి సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.  ఆ తర్వాత కొద్దిసేపటికే, కొలకత్తా హైకోర్టు ఆ బెయిల్ పై బుధవారం వరకు స్టే విధించింది. 

ఇక ఈ ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనను కూడా అరెస్ట్‌ చేయాలంటూ దాదాపు ఆరు గంటలసేపు సిబిఐ కార్యాలయం నిజాం ప్యాలెస్‌ ఎదుట కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఈ నలుగుర్నీ ఎలాంటి నిబంధనలను పాటించకుండానే అరెస్ట్ చేశారని, తనను కూడా అరెస్ట్ చేయాలని మమత డిమాండ్ చేశారు. ఆ తర్వాత కోర్టు చూసుకుంటుందంటూ అక్కడి నుంచి నిష్క్రమించారు. 

మంత్రుల అరెస్ట్‌కు వ్యతిరేకంగా టీఎంసీ కార్యకర్తలు భారీ ఎత్తున సీబీఐ కార్యాలయం వద్దకు చేరుకుని, బ్యారికేడ్లు తొలగించడానికి ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో కార్యకర్తలను చెదరగొట్టానికి రంగంలోకి దిగిన పారామిలిటరీ సిబ్బంది, పోలీసులపై టీఎంసీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు.

ఈ ఘటనపై గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎంసీ కార్యకర్తలు అన్యాయంగా ప్రవర్తిస్తూ, అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ నిమయాలను పాటించాలని ఆయన హితవు చెప్పారు. 

ఈ ఘటనపై మమతా బెనర్జీ అల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ స్పందిస్తూ బెంగాల్‌ ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, లాక్‌డౌన్‌ నియమాలను ఉల్లంఘించే చర్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందని,  చట్టబద్దంగానే ఈ యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేశారు.