సగటున కరోనా కరోనా రోగి ఖ‌ర్చు రూ.1.50 లక్షలు

కేంద్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, దేశంలో టోకు ద్రవ్యోల్బణం 2021 ఏప్రిల్‌లో 10.49 శాతానికి చేరుకున్న‌ది. అయితే ఇంతకంటే భయంకరమైనది ఆరోగ్య రంగంలో ద్రవ్యోల్బణంగా చెప్పుకోవ‌చ్చు. కరోనా సెకండ్‌ వేవ్ సందర్భంగా సాధారణ ప్రజలపై వైద్య భారం చాలా ఉన్న‌ద‌ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) విడుదల చేసిన నివేదికలో వెల్ల‌డించింది. ఎస్‌బీఐ నివేదిక‌ ప్రకారం, సెకండ్ వేవ్‌లో కరోనా బారిన పడిన వారిలో 30 శాతం మంది ద‌వాఖాన‌ల్లో చేరాల్సి వచ్చింది.

చికిత్స కోసమే రూ. 50 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వ‌చ్చింది. ప్రైవేటు ద‌వాఖాన‌ల్లో చేరిన సందర్భంలో ప్రతి కుటుంబం సగటున రూ.1.50 లక్షలు ఖర్చు చేసిన‌ట్లు అంచనా. ఈ నివేదిక ప్రకారం, 2021 ఏప్రిల్ నెల‌లో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు కేవలం 4.42 శాతంగా ఉన్న‌ది. 2021 మార్చిలో 5.21 శాతం న‌మోదైంది.

ఈ నెలలో కరోనా కారణంగా ఔషధాల భారం పెరిగిపోయింది. ఏప్రిల్‌లో ఎక్స్‌రేలు, ఈసీజీ, పాథాలజీ పరీక్షలు, నర్సింగ్ ఫీజులు మొదలైనవి పీల్చిపిప్పి చేశాయి. ఆరోగ్య‌ రంగానికి సగటు కుటుంబ వ్యయం 11 శాతం పెరిగింది.

ఇదే సమయంలో రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ భారాన్ని సాధారణ ప్రజలు భరించాల్సి ఉంటుంది. కేంద్రం, రాష్ట్రాలు పెట్రోల్‌, డీజిల్‌పై పన్ను తగ్గించ‌నిప‌క్షంలో.. రాబోయే రోజుల్లో ఇంధన వ్యయం మరింత పెరుగుతుందని, దీని ప్రభావం ఇతర ప్రాంతాల్లో కూడా కనిపిస్తుందని నివేదిక పేర్కొన్న‌ది.

రాబోయే నెలల్లో ఆరోగ్య ఖర్చులు కూడా పెరుగుతాయని నివేదిక స్ప‌ష్టం చేసింది. ఖరీదైన మందులు, వైద్య ఉత్పత్తుల కారణంగా భారతీయ కుటుంబాలు మొత్తం రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తాయని, సగటున, 30 శాతం మందిని ద‌వాఖాన‌ల్లో చేర్పించాల్సి ఉంటుంద‌ని తెలిపింది.

ఈ 30 శాతం మంది ప్రైవేటు ఆసుపత్రుల సేవలను తీసుకున్నందుకు అదనంగా రూ.35 వేల కోట్లు చేయాల్సి ఉంటుంద‌ని పేర్కొన్న‌ది. ఇవే కాకుండా, లాక్‌డౌన్‌లో ఉపాధి కోల్పోవడం వల్ల ప్రజల ఆదాయం రూ.16 వేల కోట్లు తగ్గుతుందని ఎస్‌బీఐ త‌న నివేదిక‌లో తెలిపింది. ఈ విధంగా కరోనా సెకండ్ వేవ్ కార‌ణంగా మొత్తం సాధారణ భారతీయ కుటుంబాలపై రూ.6 వేల కోట్ల భారం పడుతుందని ఈ నివేదిక అంచనా వేసింది. ఇది 2019-20 సంవత్సరంలో ఆరోగ్య రంగానికి చేసిన మొత్తం వ్యయంలో 11 శాతం రూ. 6 లక్షల కోట్లుగా పేర్కొన్న‌ది.