కరోనా వ్యాప్తిని వ్యాక్సిన్‌తోనే అడ్డుకోగలం 

కరోనా వ్యాప్తిని వ్యాక్సిన్‌తోనే అడ్డుకోగలమని ప్రపంచ ఆరోగ్యసంస్థ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్‌ సౌమ్యా స్వామినాథన్‌ స్పష్టం చేశారు. ‘ది హిందూ’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పస్తుతం భారతదేశంలో వ్యాపిస్తున్న కోవిడ్‌-19 గురించి, పరిష్కారాల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అంశాలను ఆమె వివరించారు. 

రానున్న ఆరునెలల నుండి 18 నెలల కాలం వైరస్‌ను అడ్డుకోవడానికి ఎంతో కీలకమని ఆమె చెప్పారు. భారత్‌లో వ్యాపిస్తున్న బి.1.617 తరహా కరోనా వైరస్‌కు ఎక్కువగా వ్యాపించే లక్షణం ఉందని ఆమె హెచ్చరించారు. అదే సమయంలో దేశంలో లభిస్తున్న వ్యాక్సిన్‌లు ఈ కొత్త తరహా వైరస్‌ను నిరోధించడంలో బాగా పనిచేస్తున్నట్లు తమకు సమాచారముందని ఆమె పేర్కొన్నారు.   

ప్ర: ప్రస్తుతం భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న బి.1.617 తరహా కరోనా ఎంత ఎక్కువ ప్రమాదకరమైనది ? మందులకు లొంగకుండా ఉండేదిగా ఉందా?

జ: మనకు తెలిసినంతవరకూ ఈ బి.1.617 తరహా కరోనా ఒరిజినల్‌ వైరస్‌ కన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువ వేగంగా విస్తరించగలదు. బ్రిటన్‌ లో గుర్తించిన బి.1.1.7 తరహా వైరస్‌ మొదట్లో ఇండియాలో ఎక్కువగా వ్యాపించింది. కాని ఇప్పుడు బి.1.617 దాని స్థానాన్ని ఆక్రమించింది. 

డబ్ల్యుహెచ్‌వో ఎక్కువ ప్రమాదకారులుగా (వేరియంట్స్‌ ఆఫ్‌ కన్సెర్న్‌) గుర్తించిన నాలుగు తరహాల వైరస్‌లలో ఈ బి.1.617 ఒకటి. ఇప్పుడు ఇది సుమారు 50 దేశాలలో ఉంది. ఈ బి.1.617 లో కూడా నాలుగు ఉప తరగతులు ఉన్నట్టు గుర్తించారు. వాటి మధ్య చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. 

ఇప్పటికి లభిస్తున్న సమాచారం ప్రకారం ఈ బి.1.617 వలన కోవిడ్‌-19 వ్యాధి మరింత తీవ్రంగా సోకుతుందని చెప్పడానికి ఆధారాలు లేవు. ప్రాథమిక సమాచారం బట్టి ఈ తరహా వైరస్‌ వ్యాక్సిన్‌ ల ప్రభావాన్ని (యాంటీబాడీస్‌ ఉత్పత్తి చేసే సామర్ధ్యాన్ని) కొంతవరకూ తగ్గిస్తుంది.

కోవిషీల్డ్‌ లేదా కోవ్యాక్సిన్‌ లేదా మరేదైనా వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత ఈ తరహా వైరస్‌ను ఎంత తీవ్రతతో ప్రభావితం చేస్తాయన్నది, వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి ఎంతవరకూ వైరస్‌ సోకుతుంది అన్న విషయాలను ఇంకా అధ్యయనం చేయాల్సిఉంది. కేవలం ఈ వైరస్‌ యొక్క జెనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేసినంత మాత్రాన్నే విషయం బోధపడదు. 

వైరస్‌ సోకిన రోగులకు వైద్యం చేసిన తీరును, వైరస్‌ విస్తరిస్తున్న తీరును, వ్యాక్సిన్‌ తీసుకున్న వారి ఆరోగ్యస్థితిని కొంత కాలం పాటు అధ్యయనం చేయాలి. అప్పుడే ఈ కొత్త తరహా వైరస్‌ కలిగించే ప్రభావం అర్ధం ఔతుంది.


ప్ర: ప్రజలకు సంబంధించినంతవరకూ ఏమిటి తేడా ?

జ: ఏ తరహా వైరస్‌ ఇది అన్నదాంతో ఇప్పుడు ప్రజలకు నిమిత్తం లేదు. ఏ తరహా వైరస్‌ అయినా, మూల వైరస్‌ ఒక్కటే. అదే తీరుగా ఇది కూడా ప్రవర్తిస్తోంది. ప్రజలమీద అదే విధమైన ప్రభావాన్ని చూపిస్తోంది. ఒక తరహా వైరస్‌ ఎక్కువగా విస్తరించవచ్చు, ఇప్పుడు భారత్ లో  జరుగుతున్నదిదే. ఈ తరహా (బి.1.617) చాలా తేలికగా విస్తరిస్తోంది.

అలా విస్తరించడానికి ఎక్కువ అవకాశం ఇవ్వడం కూడా ఒక కారణం. ప్రజలు మొదట్లో ఏవిధమైన జాగ్రత్తలు పాటించారో (మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం, శానిటైజర్లను తరచూ ఉపయోగించి చేతులు శుభ్రపరచుకోవడం వంటివి) అవే జాగ్రత్తలను ఇప్పుడూ శ్రద్ధగా పాటించాలి. ముఖ్యంగా సామూహిక వ్యాప్తి జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ జాగ్రత్తలు చాలా ముఖ్యం.


ప్ర : ఐతే ఇప్పుడు అందరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలంటారా ?

జ : ఖచ్చితంగా. మాకున్న సమాచారం ప్రకారం ఇండియాలో లభిస్తున్న వ్యాక్సిన్‌లు ఈ కొత్త తరహా వైరస్‌ మీద చాలా శక్తివంతంగా పని చేస్తున్నాయి. రెండు డోసులూ తీసుకున్నవారిలో కూడా కొందరికి ఇన్‌ఫెక్షన్‌ సోకవచ్చు, వారిలో కొందరు ఆస్పత్రులలో చేరవలసిన పరిస్థితి కూడా రావొచ్చు. 

ఈ వ్యాక్సిన్‌ లు 100 శాతం రక్షణ కల్పించగలవని చెప్పడం లేదు. కాని రెండు డోసులూ తీసుకున్న వారిలో అత్యధిక శాతం ప్రజలకు ఐసియులలో చేరవలసినంత తీవ్రంగా ఇన్‌ఫెక్షన్‌ సోకడం లేదని చెప్పవచ్చు. సమగ్రమైన సమాచారం, అధ్యయనం లేకుండా కేవలం అక్కడా అక్కడా అనుకునేదానిని బట్టి వ్యాక్సిన్‌ల వలన ఉపయోగం లేదని అనుకోవడం సరైంది కాదు.


ప్ర :  మీరు భవిష్యత్తులో కూడా కోవిడ్‌ మళ్ళీ, మళ్ళీ రావచ్చునని అన్నారు. అసలు ఈ కోవిడ్‌-19 ఎంతకాలం కొనసాగుతుందో చెప్పగలరా ?

జ : ప్రస్తుతం మనం ఈ మహమ్మారి చాలా ఉధృతంగా ఉన్న క్లిష్ట దశలో ఉన్నాం. వచ్చే 6 నుండి 18 నెలల కాలాన్ని ఏవిధంగా నెట్టుకురావాలన్న దానిమీద కేంద్రీకరించడం ఇప్పుడు చేయవలసిన పని. ఈ కాలం అత్యంత గడ్డుకాలంగా ఉండబోతుంది. ఆ తర్వాత ఈ వ్యాధిని మొత్తంగానే నిర్మూలించడమా లేక అదుపు చేయడమా అన్నది చర్చించవచ్చు. 

ఈ వెరౖస్‌ ఏ విధంగా పరిణామం చెందుతుంది అన్నదానిపై భవిష్యత్తు ఎక్కువగా ఆధారపడివుంటుంది. ఏ యే తరహాలలో వైరస్‌ పరిణామం చెందుతుంది? వ్యాక్సిన్‌ లు ఎంతకాలం రోగనిరోధక శక్తిని నిలబెట్టగలుగుతాయి అన్నది కూడా ముఖ్యం. దీర్ఘకాలంలో ఏం జరుగుతుంది అన్నది ఇప్పుడే చెప్పలేం.

ఐతే ఇప్పుడున్న తీవ్రమైన దశకు మాత్రం ముగింపు ఉంటుందని చెప్పగలను. ప్రపంచ జనాభాలో కనీసం 30 శాతం వ్యాక్సిన్‌ పొందగలిగితే, దీని తీవ్రత తగ్గుతుంది. ఈ పరిస్థితి 2021 చివరికి రావచ్చును. అప్పటికి మరణాల సంఖ్య బాగా తగ్గుముఖం పట్టవచ్చు. ఆ తర్వాత, 2022 లో 60 నుండి 80 శాతం ప్రపంచ జనాభాకి వ్యాక్సిన్‌ అందించడం మీద కేంద్రీకరించాలి.


ప్ర : కోవిడ్‌-19 కి వైద్యం చేసే విధానాలలో చాలా తేడాలు ఉన్నయి. ఇప్పుడు ప్రభుత్వం ఎటువంటి విధానాన్ని అనుసరించడం సరైనది ఔతుంది ?

: వాస్తవ ఆధారాల ప్రాతిపదికన డబ్ల్యుహెచ్‌ఓ ఎప్పటికప్పుడు ”సజీవమైన మార్గదర్శకాలను” జారీ చేస్తూ వుంటుంది. ఎప్పటికప్పుడు వస్తున్న అనుభవాలను బట్టి మార్పులు, చేర్పులు ఉంటాయి. ఆ ప్రాతిపదికనే చాలా రకాల ఔషధాల విషయంలో మేం సిఫార్సులు చేశాం. 

మరణాల నుండి కాపాడడంలో ఇప్పటివరకూ ఒకే ఒక ఔషధం ఎక్కువగా పని చేస్తోంది. అదే స్టిరాయిడ్స్‌. ( డెక్సామిథాజోన్‌). ఇది కూడా ఆస్పత్రిలో అడ్మిట్‌ అయి, ఆక్సిజన్‌ మీద ఉన్న వారిమీదనే ఇది ఎక్కువగా ప్రభావం చూపగలుగుతుంది.

 ఊపిరితిత్తుల్లో వాపు (ఇన్‌ఫ్లమేషన్‌) ఏర్పడి, లోనికి ఆక్సిజన్‌ తీసుకోవడం కష్టసాధ్యంగా మారినప్పుడు , ఆ వాపును తగ్గించడానికి ఈ స్టిరాయిడ్స్‌ పని చేస్తుంది. పొరపాటు సమయంలో పొరపాటు ఔషధాన్ని వాడడం వలన మంచి జరగకపోగా హాని ఎక్కువగా జరుగుతుందని ప్రజలు గమనించాలి.

ఇప్పుడు చాలామంది వాడుతున్న డాక్సీసైక్లిన్‌, అజిత్రోమైసిన్‌, ఐవర్‌మెక్టిన్‌ వంటి ఔషధాలు ఏ ప్రభావాన్నీ కలిగించినట్టు దాఖలాలు లేవు. నిజానికి ఐవర్‌మెక్టిన్‌ ను కేవలం వైద్య పరిశోధనల సందర్భంలో తప్ప ఇతరత్రా ఉపయోగించవద్దని డబ్ల్యుహెచ్‌వో సిఫార్సు చేసింది. 

అదేవిధంగా రెమిడెసివిర్‌, హైడ్రాక్సీక్లోరోక్విన్‌, నోపినావిర్‌ లాంటి ఔషధాలను వినియోగించవద్దని కూడా సిఫార్సు చేసింది. ఏ దేశానికి ఆ దేశం వైద్యం చేసే విధానాల మార్గదర్శకాలను రూపొందించుకోవలసి వుంటుంది. ఆ మార్గదర్శకాలకు వాస్తవ ఆధారాలు ప్రాతిపదికగా ఉండాలి. ఎప్పటికప్పుడు వాటిని తాజాగా తగు మార్పులతో జారీ చేస్తూ వుండాలి.