ఇజ్రాయెల్ దాడిలో హమాస్ అగ్రనేత ఇల్లు ధ్వంసం

ఇజ్రాయెల్ మిలిటరీ గాజాలోని హమాస్ అగ్ర నాయకుడి ఇంటిని వైమానిక దాడిలో పేల్చింది. ఇజ్రాయెల్ ఆర్మీ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ హిడాయ్ జిల్బెర్మాన్ వెల్ల‌డించిన స‌మాచారం ప్రకారం, ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హమాస్ అగ్ర నాయకుల్లో ఒకరైన యెహియా సిన్వర్ ఇంటిని లక్ష్యంగా చేసుకుని పేలుళ్లు జ‌రిగాయి. 

దాడి సమయంలో అతను అక్కడ ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ దాడి జరిగిన ఇల్లు దక్షిణ గాజా ప్రాంతంలో ఖాన్ యూనస్ పట్టణంలో ఉన్న‌ది. ఇజ్రాయెల్ సైన్యం తెలిపిన వివ‌రాల‌ ప్రకారం, సిన్వర్ సోదరుడి ఇంటిపై కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో చాలా మంది పాలస్తీనా యోధులు మరణించారు.

పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య బాంబు దాడులు సోమవారం ప్రారంభమయ్యాయి. హమాస్, ఇతర మిలిటెంట్ గ్రూపులు ఇప్పటివరకు ఇజ్రాయెల్‌పై 2 వేలకు పైగా రాకెట్లను పేల్చాయని ఇజ్రాయెల్ ఆరోపిస్తున్న‌ది. శరణార్థి శిబిరంపై జ‌రిపిన‌ దాడిలో 10 మంది మరణించారు.

కాగా ఈ యుద్ధం కొన‌సాగుతుంది అని ఇజ్రాయెల్ ప్ర‌ధాన‌మంత్రి బెంజిమిన్ నెత‌న్యాహు స్ప‌ష్టం చేశారు. మాపై కాలు దువ్విన హ‌మాస్‌కు త‌గిన గుణ‌పాఠం చెప్పేంత వ‌ర‌కు వెనుకంజ వేయ‌మ‌ని తేల్చిచెప్పారు. 

తొలుత పాలస్తీనా దాడిలో ఇజ్రాయెల్‌లో ఎనిమిది మంది మరణించారు. ఇజ్రాయెల్ ఫైటర్ జెట్ గాజాలోని ముఖ్య ప్రాంతాల‌పై బాంబు దాడులు చేసింది. అనేక బహుళ అంతస్తుల భవనాలను లక్ష్యంగా పెట్టుకుని బాంబులు వేస్తున్నారు. గాజా ప్రాంతంలో అతిపెద్ద ద‌వాఖాన అయిన‌ షిఫా ద‌వాఖాన‌కు వెళ్లే ర‌హ‌దారి తుడిచిపెట్టుకుపోయింది. దాంతో ద‌వాఖాన‌కు వెళ్ల‌డం పాల‌స్తీనియ‌న్ల‌కు చాలా ఇబ్బందిక‌రంగా త‌యారైంది.

ఆదివారం జ‌రిగిన ఈ దాడుల్లో గాజాలోని మూడు భ‌వ‌నాలు కుప్ప‌కూలాయి. 42  మంది పాల‌స్తీనా పౌరులు మృతిచెందారు. గాజాలో హమాస్ మిలిటెంట్‌ నాయ‌కులు త‌ల‌దాచుకున్న భ‌వ‌నాలే ల‌క్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. 

గాజాలో ఇప్పటి వరకు   కనీసం 188 మంది పాలస్తీనియన్లు  చనిపోయారు. వీరిలో 39 మంది చిన్నారులు కాగా, 22 మంది మహిళలు. 950 మంది గాయపడ్డారు. 2014లో జరిగిన ఘర్షణలో 70 మంది ఇజ్రాయిలీలు, 2100 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు.