తక్షణమే రమేశ్‌ ఆస్పత్రికి రఘురామ….. హైకోర్టు ఆదేశం 

తక్షణమే రమేశ్‌ ఆస్పత్రికి రఘురామ….. హైకోర్టు ఆదేశం 

మేజిస్ట్రేట్‌ కోర్టు ఆదేశాల ప్రకారం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు రమేశ్‌ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించకుండా ఆయన్ను జైలుకు ఎలా తరలించారని హైకోర్టు రాష్ట్రప్రభుత్వాన్ని, సీఐడీ అధికారులను ప్రశ్నించింది. ఆయన్ను తక్షణమే రమేశ్‌ ఆస్పత్రికి తరలించాలని ఆదేశించింది. ఎంపీ వంటిపై ఉన్న గాయాలను గుంటూరు ప్రభుత్వాస్పత్రితోపాటు రమేష్‌ ఆస్పత్రిలోనూ పరిశీలించి నివేదికలివ్వాలని గుంటూరు ఆరో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలుచేయలేదని సీఐడీని ప్రశ్నించింది.

ఎంపీని రమేశ్‌ ఆస్పత్రికి తరలించాలన్న ఆదేశాలపై సీఐడీ తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చింది. మేజిస్ట్రేట్‌ ఆదేశాలపై స్టే విధించాలన్న అభ్యర్థనను సైతం పక్కనబెట్టింది. ప్రైవేటు ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహిస్తే తప్పేమిటని ప్రశ్నించింది.

మేజిస్ట్రేట్‌ కోర్టు ఆదేశాలను అమలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను 19వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సి. ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ కె.లలితతో కూడిన ధర్మాసనం ఆదివారం రాత్రి ఆదేశాలిచ్చింది. సీఐడీ కస్టడీలో ఉన్న రఘురామరాజును శనివారం గుంటూరులోని మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచగా.. గుర్తుతెలియని వ్యక్తులు తనను కొట్టారని ఆయన ఫిర్యాదుచేశారు.

ఈ నేపథ్యంలో పోలీసులు ఎంపీని కొట్టిన విషయాన్ని, గాయాలకు సంబంధించిన ఫొటోలను జతపరుస్తూ పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు హైకోర్టుకు లేఖ రాశారు. ఆ లేఖను వ్యాజ్యంగా స్వీకరించిన ధర్మాసనం శనివారం అత్యవసరంగా విచారించింది.

ఎంపీ వంటిపై ఉన్న గాయాలను పరిశీలించి సీల్డ్‌ కవర్‌లో నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ గుంటూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌ ఆధ్వర్యంలో మెడికల్‌ బోర్డును ఏర్పాటు చేసింది. ఆ బోర్డు నివేదిక గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ద్వారా హైకోర్టుకు చేరింది. దీంతో వ్యాజ్యం ఆదివారం సాయంత్రం మరోసారి విచారణకు వచ్చింది.

అదనపు ఏజీ కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని రఘురామకృష్ణంరాజు తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు చెప్పారు. మెడికల్‌ బోర్డులోని వైద్యులతో మాట్లాడేందుకు వీల్లేకపోతే.. సీఐడీ అదనపు డీజీ ఆస్పత్రిలోని ఎంపీ గదికి ఎలా వెళ్లారని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. 

జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న వ్యక్తి వద్దకు పోలీసు అధికారి వెళ్లడం చట్టవిరుద్ధమని తెలిపారు. ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌.. వైసీపీ పార్టీ లీగల్‌ సెల్‌లో పనిచేసే వ్యక్తి భార్య అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తమకు నోటీసులు ఇవ్వకుండా మేజిస్ట్రేట్‌ ఆదేశాలను సవరించలేరని గుర్తుచేశారు. జైల్లో ఉన్న ఎంపీని ప్రభుత్వం హతమార్చేందుకు ప్రయత్నిస్తోందని. దీనిని రికార్డు చేయాలని ధర్మాసనాన్ని కోరారు.