చైనాలో మసీదులు మాయ‌మ‌వుతున్నాయి 

చైనాలో మసీదులు మాయ‌మ‌వుతున్నాయి 

చైనాలో మసీదులు మాయ‌మ‌వుతున్నాయి. మైనార్టీల‌పై దాడులు జ‌రుగుతున్నాయంటూ అమెరికా స‌హా మాన‌వ హ‌క్కుల సంస్థ‌లు ఘోషిస్తున్నా.. చైనా ఇవేవీ ప‌ట్టించుకున్న‌ట్లు క‌నిపించ‌డంలేదు. త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతున్న‌ది. త‌మ జిన్జియాంగ్ ప్రాంతాన్ని సంద‌రంగా తీర్చిదిద్దేందుకు మసీదుల‌ను నేల‌మ‌ట్టం చేస్తున్న‌ట్లు ఆరోప‌ణ‌లు విన‌వ‌స్తున్నాయి. ఆరోప‌ణ‌లు నిజ‌మే అనేందుకు గుర్తుగా జియామాన్ మ‌సీదు క‌నిపించ‌కుండాపోయింది.

జిన్జియాంగ్‌లోని పశ్చిమ ప్రాంతమైన ఖిరా నగరంలోని జియామాన్ మసీదు ఎత్తైన గోడలు ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ప్రచార సంకేతాల వెనుక దాగి ఉన్న‌ది. ఇది మతపరమైన ప్రదేశానికి నిలయంగా ఉన్న‌దని చెప్ప‌డానికి కూడా వీలులేకుండా మ‌సీదును క‌నిపించ‌కుండా చేశారు. 

గ‌త నెల‌లో పెద్ద మ‌సీదు ఉన్న ప్రాంతంలో చిన్న మెష్ కిటికీల‌కు అమర్చిన ఇనుప చ‌ట్రం వెనుక ఇద్ద‌రు ఉయ్గార్ జాతి మ‌హిళ‌లు బిక్కుబిక్కుమంటూ కూర్చుని ఉండ‌టం అంత‌ర్జాతీయ మీడియా కంట‌ప‌డింది. మీడియా అక్క‌డికి వ‌చ్చిన విష‌యం తెలుసుకున్న సాదాసీదా దుస్తుల్లో ఉన్న న‌లుగురు వ్య‌క్తులు వ‌చ్చి.. సైట్ ప‌రిస‌రాల్లోని భ‌వ‌నాల గేట్ల‌కు తాళాలేశారు.

అనంత‌రం మీడియా ద‌గ్గ‌రికి వ‌చ్చి.. ఇది నిషిద్ధ ప్రాంతం అని, ఫొటోలు తీయ‌డం చ‌ట్ట‌విరుద్ధ‌మ‌ని హెచ్చ‌రించారు. ఇక్క‌డ ఒక పెద్ద మ‌సీదు ఉండేది క‌దా.. అని వారిని ప్ర‌శ్నించ‌గా.. “ఇక్కడ మసీదు లేదు.. ఈ ప్రాంతంలో ఎప్పుడూ మసీదు లేదు” అని క‌టువుగా సమాధానమిచ్చారు. భవనం నాలుగు మూలల్లోని మినార్లు 2019 లో తీసిన ఉపగ్రహ చిత్రాలలో కనిపిస్తున్నాయి.

మసీదు కేంద్ర గోపురం ఉన్న చోట పెద్ద నీలిరంగు లోహపు పెట్టె ఉంది. ఉపగ్రహ చిత్రాలు తీసిన సమయంలో ఇది ప్రార్థనా స్థలమా? కాదా? అనేది స్పష్టంగా తెలియరాలేదు. ఈ ప్రాంతంలోని మ‌సీదుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఇక్క‌డి ముస్లి ఉయ్గార్ జాతీయుల‌పై అణ‌చివేత‌కు పాల్ప‌డుతున్న‌ద‌ని చైనాపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో జిన్జియాంగ్‌లో అంతా స‌క్ర‌మంగానే ఉన్న‌ద‌ని చెప్పుకోవ‌డానికి ఆరాట‌ప‌డిన చైనా ఇటీవ‌లి నెల‌ల్లో స్థానిక మీడియాతో క‌లిసి ప‌రిశోధ‌కులు, హ‌క్కుల సంఘాలు, గ‌తంలో ఇక్క‌డ నివసించిన వారితో క‌లిసి ప‌ర్య‌ట‌న‌లు ఏర్పాటు చేసింది. అనంత‌రం వారు జిన్జియాంగ్‌తోపాటు బీజింగ్‌లో మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి మ‌త‌ప‌ర‌మైన ప్ర‌దేశాల‌ను బ‌లవంతంగా నాశ‌నం చేశార‌న్న ఆరోప‌ణ‌లు ప‌చ్చి అబ‌ద్ధాల‌ని కొట్టిప‌డేశారు.

ఇదే విష‌యాన్ని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చునింగ్ ను ప్ర‌శ్నించ‌గా.. కొన్ని మసీదులు కూల్చివేత‌కు గుర‌య్యాయ‌ని, మరికొన్ని గ్రామీణ పునరుజ్జీవనంలో భాగంగా అప్‌గ్రేడ్ చేయబడి విస్తరించారని చెప్పారు. అయితే ముస్లింలు తమ మతాన్ని ఇంట్లోగానీ, మసీదుల్లోగానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆచరించవచ్చని పేర్కొన్నారు.