కొవిడ్‌పై పోరుకు క‌ర్ణాట‌క సీఎం, మంత్రులు ఏడాది వేతనం 

కరోనా వైరస్‌పై పోరు కోసం కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ య‌డ్యూర‌ప్ప, ఆయ‌న క్యాబినెట్‌లోని మంత్రులు ఏడాది వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ప్రకటించారు. ఈ వారం మొదట్లోనే ఈ విషయంపై క్యాబినెట్ నిర్ణయం తీసుకోగా ఈ నెల 11న ఆదేశాలు జారీ అయ్యాయి. 

ఆ ప్రకారం ఈ నెల 1వ తేదీ నుంచే అమల్లోకి వస్తుంది. రాష్ట్రం కరోనా మహమ్మారి గుప్పిట్లో చిక్కుకోవడంతో బయటపడేందుకు ప్రభుత్వం పలు ఆంక్షలు అమలు చేస్తున్న‌ది. రాష్ట్రంలో ప్రతిరోజూ 40-50 వేలకు పైగా కేసులు వెలుగుచూస్తున్నాయి. ఆరు లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటి వరకు 6 వేల మరణాలు సంభవించాయి.

కొవిడ్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఆక్సిజన్, ఆస్ప‌త్రుల్లో పడకల కొరత ఏర్పడింది. అలాగే అవసరమైన మందుల కొరత కూడా వేధిస్తున్న‌ది. కరోనాను అదుపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 10 నుంచి 24 వరకు లాక్‌డౌన్ అమలు చేస్తోంది.

కాగా, కరోనాపై పోరు కోసం ముఖ్యమంత్రి యడియూరప్ప తన వేతనాన్ని విరాళంగా ప్రకటించడం ఇది రెండోసారి. గత నెలలో తన ఏడాది వేతనం రూ. 24.10 లక్షలను వేతనంగా ఇచ్చేశారు. రూ.24.10 లక్షల చెక్‌ను అప్పటి చీఫ్ సెక్రటరీ టీఎం విజయ్ భాస్కర్‌కు అందించారు. అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి గోవింద్ కర్జోల్ కూడా ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 5 లక్షల విరాళం ప్రకటించారు.