బ్యాటరీ స్టోరేజ్ తయారీకి రూ.18,100 కోట్ల పిఎల్‌ఐ 

దేశంలో బ్యాటరీ స్టోరేజ్‌ను ప్రోత్సహించేందుకు గాను రూ.18,100 కోట్ల పిఎల్‌ఐ (ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక) పథకానికి బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ‘మేక్ ఇన్ ఇండియా’ను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ అనుమతి ఇచ్చింది. దీంతో అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ (ఎసిసి) స్టోరేజ్ రూ.45,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించనుంది.

కేబినెట్ సమావేశం తర్వాత కేంద్ర సమాచార, ప్రసారాల శాఖమంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ, ఎసిసి 50 గిగావాట్ హవర్, 5 జిడబ్లుహెచ్ తయారీ సామర్థ్యం ఈ ప్రతిపాదన లక్ష్యమని అన్నారు. ఇది గ్రీన్ గ్రోత్‌ను ప్రోత్సహిస్తుందని, కాపర్, అలాగే బాక్సైట్ వంటి స్థానిక ఉత్పత్తుల వినియోగం పెంచనుందని ఆయన పేర్కొన్నారు.

ఇది దిగుమతి వ్యయాన్ని తగ్గించి, దేశీయ ఇంధనాన్ని పెంచుతుంది. దేశంలో విద్యుత్ వాహనాల ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ద్విచక్ర వాహనాలు, ఫోర్ వీలర్లు, భారీ వాహనాలు ప్రయోజనం పొందుతాయి. దీనివల్ల ఆయిల్ బిల్లు రూ .2 నుంచి 2.5 లక్షల కోట్లు ఆదా అవుతుంది. దీని కింద నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ (ఎసిసి) బ్యాటరీ స్టోరేజ్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఎసిసి అనేది కొత్త తరం అధునాతన నిల్వ సాంకేతికత, ఇది విద్యుత్ శక్తిని ఎలక్ట్రోకెమికల్ లేదా రసాయన శక్తిగా నిల్వ చేస్తుంది. అవసరమైనప్పుడు దీనిని మళ్లీ విద్యుత్ శక్తిగా మార్చుకోవచ్చు. ఎసిసి బ్యాటరీ నిల్వ నుండి దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది.

గతేడాది కరోనా సమయంలో పిఎల్‌ఐ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని ద్వారా 12 రంగాలకు ప్రయోజనం చేకూర్చాలని ప్రభు త్వం నిర్ణయించింది. తాజాగా ఈ పథకం కింద బ్యాటరీ నిల్వ కోసం కేంద్రం ఆమోదం తెలిపింది. దేశంలో విక్రయించే మొత్తం వాహనాల్లో 84 శాతం ద్విచక్ర వాహనాలు, త్రీ వీలర్లు ఉన్నాయి. అందువల్ల ఈ రెండు విభాగాలలోనూ ఎలక్ట్రిక్ వాహనాలను పెంచేందుకు ప్రభుత్వం తీవ్రం గా కృషి చేస్తోంది.

2025 నాటికి ప్రతి ఏడాది 4 మిలియన్ల విద్యుత్ వాహనాలు అమ్ముడవ్వాలని అంచనా. 2030 నాటికి దీన్ని ఒక కోటికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. దీనికోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు.