చిన్నారులపై భారత్‌ బయోటెక్‌ క్లినికల్ ట్రయల్స్‌ 

ప్రస్తుతం దేశంలో 18 ఏళ్ల పైబడిన వారందరికీ టీకాలు వేసేందుకు అనుమతి లభించిన నేపథ్యంలో చిన్నారులపై క్లినికల్‌ ట్రయల్స్‌ ఫేజ్‌ 1, ఫేజ్‌ 2 నిర్వహించేందుకు భారత్‌ బయోటెక్‌కు నిపుణుల ప్యానెల్‌  ఆమోదం తెలిపింది. కోవాగ్జిన్‌ టీకా వివరాలను పంపాలని సిఫార్సు చేసింది.

ఒక వేళ ఇది ఆమోదం పొందితేపెద్ద మొత్తంలో యువత టీకాలు వినియోగించుకునే అవకాశం లభిస్తుంది. అదేవిధంగా పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయి. తరగతులకు విద్యార్థులు స్వేచ్ఛగా హాజరు కావచ్చు.  2 నుండి 18 సంవత్సరాల వయస్సు పిల్లలపై ఫేజ్‌ 1, ఫేజ్‌ 2 క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు అనుమతి కోరుతూ హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ సమర్పించిన దరఖాస్తుపై సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సిడిఎస్‌సిఒ)లోని కోవిడ్‌-19పై సబ్జెక్‌ ఎక్స్‌ఫర్డ్‌ కమిటీ (ఎస్‌ఇసి) చర్చించింది.

ఢిల్లీ ఎయిమ్స్‌, పాట్నా ఎయిమ్స్‌, నాగ్‌పూర్‌లోని మెడిట్రినా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో 525 సబ్జెక్టులపై పరీక్షలు చేపట్టనుంది. చర్చల అనంతరం రెండు దశల ట్రయల్స్‌కు కోవాగ్జిన్‌కు నిపుణుల కమిటీ గ్రీన్‌ సిగ్నల్  ఇచ్చింది.

కాగా,  మే 1 నుండి కోవాగ్జిన్‌ సరఫరాను నిలకడగా కొనసాగిస్తున్నామని భారత్‌ బయోటెక్‌ తెలిపింది. నేరుగా రాష్ట్రాలకు అందిస్తున్నట్లు తెలిపింది. 18 రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఢిల్లీ, బీహార్‌, గుజరాత్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ తదితర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు హైదరాబాద్‌కు చెందిన సంస్థ పేర్కొంది.

‘కోవాగ్జిన్‌ను మే 1 నుండి 18 రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నాం. మా ప్రయత్నాలు మేం చేస్తున్నాం. వ్యాక్సిన్‌ సరఫరా నిలకడగా చేస్తున్నాము’ అని ట్వీట్‌లో పేర్కొంది. ఎపితో పాటు అసోం, బీహార్‌, చత్తీస్‌గఢ్‌, ఢిల్లీ, గుజరాత్‌, హర్యానా, జమ్ము కాశ్మీర్‌, జార్ఖండ్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, త్రిపుర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ వ్యాక్సిన్లను తరలిస్తోంది.

కేంద్రం ప్రభుత్వం నుంచి వ‌చ్చి కేటాయింపుల ఆధారంగా ఈ టీకాల‌ను నేరుగా రాష్ట్రాల‌కు పంపుతున్నట్లు కంపెనీ ఎండీ సుచిత్రా ఎల్లా ఇటీవల తెలిపారు. ప్రస్తుతం కొవాగ్జిన్‌ టీకాను కంపెనీ రాష్ట్రాలకు రూ.400కు సరఫరా చేస్తోంది.