మీడియా మాఫియాను ఎదుర్కొంటున్న భారత్

మీడియా మాఫియాను ఎదుర్కొంటున్న భారత్

కోవిడ లాంటి మహమ్మారి బారిన పడి లేదా వైద్యం అందక ఎవ్వరూ చనిపోకూడదనే ప్రతీ సామాన్యుడి కోరిక. వైద్యులు రాత్రీపగలు తమ శక్తికి మించిన బాధ్యత భుజాన వేసుకొని శ్రమిస్తున్నారు, ప్రతీ రోగిని తమ శాయశక్తులా , కంటికి రెప్పలా కాపాడుతూనే ఉన్నారు . ఈ రెండవసారి తాకిడిని భరిస్తూ తమ జీవితాలను ధారపోస్తున్నారు .

ఇదే సమయం లో అదిగో అక్కడ ఆ శ్మశానాల దగ్గర ఆ రాకాసి రాబందుల వలె , కొందరు పాత్రికేయులు , రిపోర్టర్లు చచ్చిన శవాలను సైతం తమ ‘ ఎజెండా ‘ కోసం వాడుకుంటూ , మసిపూసి మారేడుకాయ చేసి . నిజాలను కాల్చేసి అబద్దాలతో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. దేశానికి తగిలిన గాయాలకు మందు పెట్టకపోగా వీలైనంత కారం అద్ది, గాయాలు రేపుతున్నారు. కొందరు `ప్రముఖ జర్నలిస్ట్’లు ‘తండ్రి చావును’ కూడా తమ దేశవ్యతిరేక ‘ఎజెండా‘ కు వాడుకుంటున్నారు .

ఈ కోవిడ్ విషాదాన్ని ప్రచార అస్త్రంగా వాడుకునేంతగా దిగజారిపోయారు .

మీడియాని ఎవరి చేతిలో ఉంటుందో వారే ప్రజల మనోభావాలను కూడా నియంత్రించగలుగుతారని అంటారు.  కోవిడ్ రెండవసారి తాకిడి చాలా ఉదృతంగా ఉంది. వైరస్ కొత్త రకం చాలా ప్రమాదకరంగా, ప్రాణాంతకంగా ఉందన్నది వాస్తవం. ఇదిగో ఇక్కడే ఈ  `ఎడమ వాటం’ రాబందులకు ఒక గొప్ప అవకాశం కనిపించింది. ప్రపంచ దేశాల ముందు భారతదేశ ప్రతిష్ఠను దిగజార్చే అద్భుత అవకాశం దొరికింది. మహమ్మారి మరణాలను కూడా తమ స్వార్ధ ప్రయోజనాలకు ఉపయోగించుకునేందుకు సిద్ధపడ్డారు.

భారత్ లో ఈ కోవిడ్ రెండవసారి తాకిడి `తీవ్రతను’ ప్రపంచానికి తెలిపేందుకు న్యూయార్క్ పోస్ట్ గుండెలను పిండేసే ఒక చిత్రాన్ని ప్రచురించింది. ఒక స్త్రీ శవం రోడ్డు పక్కన పడివుంది, ఆ శవాన్ని తట్టి లేపే ప్రయత్నం చేస్తున్న యువతి, బహుశా ఆ స్త్రీ మూర్తి కూతురు కావచ్చు.  ఇది భారత్ లో కోవిడ్ మరణాల గురించి ప్రచురించిన చిత్రం. కానీ ఇందులో దిమ్మతిరిగే విషయం ఏమిటంటే ఆ చిత్రం సంవత్సరం క్రితం 07th May 2020 న  విశాఖపట్నం సమీపంలో  జరిగిన ఒక గ్యాస్ లీక్ ప్రమాద సమయంలో తీసిన చిత్రం .   న్యూయార్క్ పోస్ట్ మాత్రం 26 April 2021 న “COVID surge swallowing people in India, the footage shows people dead in streets” ( వీధుల్లో ఎక్కడ చూసినా శవాలు – భారత్ లో ప్రజల ప్రాణాలు తోడేస్తున్న కోవిడ్)  అనే శీర్షికతో (Heading)  ప్రచురించింది.

 

ఎప్పుడైతే నెటిజెన్ లు ఈ ఫోటో గురించి troll  చేయడం మొదలు పెట్టారో వెంటనే ఆ చిత్రాన్ని మార్చేశారు. కానీ ఆ వార్తను , శీర్షికను మాత్రం మార్చే ప్రయత్నం చేయలేదు . భారత్ లో ఎంతో దయనీయమైన, ఆందోళనకరమైన పరిస్థితి ఉందని ప్రచారం చేయడానికి నకిలీ చిత్రాలను కూడా ఉపయోగించి న్యూయార్క్ పోస్ట్ పత్రిక అంత అత్యుత్సాహాన్ని చూపడానికి కారణం ఏమిటి? భారత్ ను కించపరచడంలో అంత ఆసక్తి ఎందుకు? ఇక్కడ పెను విషాదం సంభవిస్తే దానిని ప్రచారం చేసి తమ పబ్బం గడుపుకోవాలనే కోరికా?

 

బ్రిటీష అమెరికన్ వార్తా సంస్థ ‘ Getty Images ‘ అయితే హిందూ శ్మశానవాటికల్లో కాలుతున్న శవాల ఫోటోలను ఏకంగా అమ్మకానికి పెట్టింది. అలాంటి ఒక పెద్ద ఫోటో ధర సాక్షాత్తు 23 000 రూపాయలని ప్రకటించింది. దీనితో ఈ `అపూర్వ అవకాశాన్ని’ అందిపుచ్చుకునేందుకు  భారతీయ, విదేశీ ఫోటోగ్రాఫర్స్ అంతా రంగంలోకి దిగారు. శవాలు కాలుతున్న ఫోటోలు తీసి అమ్మకానికి పెట్టేస్తున్నారు. మహమ్మారి మూలంగా ప్రాణాలు కోల్పోయినవారి పట్ల కనీస మర్యాద, గౌరవం చూపించడం లేదు. శ్మశాన వాటికల విహంగ వీక్షణ చిత్రాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఆ ఫోటోగ్రాఫర్లు డ్రోన్ లు ఉపయోగించారా? శ్మశానవాటికల్లో ఇలా డ్రోన్ లు ఉపయోగించి ఫోటోలు తీయవచ్చునా? గార్డియన్ పత్రిక అలాంటి విహంగ వీక్షణ చిత్రాన్నే ప్రచురించింది. ఆ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆందోళనను, అలజడిని కలిగించింది కూడా. (కానీ నిజానికి అలాంటి చిత్రాలు తీయడం, ప్రచురించడాన్ని ఏమాత్రం అనుమతించకూడదు. ఎందుకంటే అంతిమ సంస్కారం అన్నది ఆ వ్యక్తి, అతని కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయం. దానిని బహిరంగపరచడం, ప్రచారం చేయడం సరికాదు.)

తన ప్రచారం కోసం తండ్రి మరణాన్ని కూడా వాడుకున్న బరఖాదత్

రాబందులన్నీ ఒక చోట చేరితే , శవాలు ఉన్నాయి అని మనకు అర్ధం అవుతుంది.  బరఖాదత్ శ్మశానవాటికలకు దూరంగా ఎలా ఉండగలుగుతుంది?  ఏప్రిల్ 19  న ఆమె ఏకంగా సూరత్ లోని శ్మశాన వాటిక నుంచే రిపోర్టింగ్ చేసింది.  బాధ, నిరాశ, నిస్పృహను చూపాలంటే శ్మశాన వాటికని మించి అనువైన ప్రదేశం ఉంటుందా ?  పైగా గోరంతను కొండంతను చేయగలిగే మోసపూరిత దైన్య బేహారులైన బరఖా లాంటి వారికి ఇటువంటి స్థలాలే కావాలి .

దురదృష్టవశాత్తు ఆమె వృద్దుడైన తండ్రి కోవిడ్ కారణంగా చనిపోయారు.  అంత బాధలో కూడా ఆమె తన ఎజెండా మరచిపోలేదు. ప్రతీ పదాన్ని చాలా చాకచక్యం గా తన వ్యూహానికి తగ్గట్టుగా తడబడకుండా మాట్లాడారు. పదాల ఎంపిక ఎలా వుంది అంటే – వినే వారికి నిజంగా గుండె పిండేసేంత  భావోద్వేగాన్ని కలిగించింది.  ‘నాకు ఊపిరి ఆడటం లేదు. ట్రీట్మెంట్ ఇవ్వండి‘ అని తన తండ్రి ఆఖరుక్షణంలో వేడుకున్నారని సి ఎన్ ఎన్ చానల్ తో మాట్లాడుతూ ఆమె వాపోయారు.

అయితే బరఖాదత్ సి ఎన్ ఎన్ కు, ఫ్రేక్షకులకు చెప్పని విషయం ఏమిటంటే ఆమె తండ్రి బాగా పేరున్న కార్పొరేట్ ఆసుపత్రి ‘మెదాంతా‘లో చికిత్స పొందారు.  నిపుణులైన, ప్రసిద్దులయిన వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు వైద్యం అందించారు. అంత నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆయన చివరి క్షణంలో ‘నాకు ఊపిరి ఆడటం లేదు. ట్రీట్మెంట్ ఇవ్వండి‘ అని అన్నారంటే ఆశ్చర్యంగా లేదూ?? పైగా ఎవరిని అనుమతించని ఐసియు లోకి తండ్రి ఆఖరి మాటాలు వినటానికి బరఖాకు ఎలా వీలైంది? (పైగా అది కోవిడ్ వార్డ్). ఈ ప్రశ్నలకు సమాధానం ఆమే చెప్పాలి .

పెను విషాదాన్ని సైతం స్వార్ధ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలనుకునే రాబందు తరహా పాత్రికేయులకు బరఖాదత్ మంచి ఉదాహరణ. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో, పేరున్న హాస్పిటల్ లో వైద్యం అందుకుంటున్న బరఖా తండ్రి గారే ‘ నాకు ఊపిరి ఆడటం లేదు ట్రీట్మెంట్ ఇవ్వండి ‘ అని అన్నారంటే, మరి కనీసం ఆసుపత్రి మెట్లు ఎక్కడానికి కూడా తాహతు లేని వారి పరిస్థితి ఏమిటి? అక్కడున్న వైద్యులకంటే నిపుణులు ఎక్కడ దొరుకుతారు?

భారతదేశంలో వూహించని రీతిలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఉన్న వైద్య సదుపాయాలు సరిపోవటం లేదు. వైద్యులు రాత్రనకా పగలనక శ్రమిస్తూ ఈ ఉత్పాతాన్ని శాయశక్తులా ఎదుర్కొంటున్నారు. ఈ విపత్కర సమయంలో మీడియా సకారాత్మక విమర్శతో అటు ప్రభుత్వాన్ని , ధైర్యాన్ని ఇచ్చే వార్తలతో ఇటు ప్రజలను మెప్పించాలి. ఏం చేస్తోంది? భయాందోళనలు సృష్టిస్తోంది.   కోవిడ్ బారిన పడనివారు కూడా భయపడేటట్టుగా వార్తలు ప్రచారం చేస్తోంది.

 

(ఆస్ట్రేలియా టుడేలో ప్రచురితమైన వ్యాసానికి స్వేచ్ఛానువాదం )

అనువాదం: చంద్రమౌళి కళ్యాణచక్రవర్తి