‘ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్’  సచిన్‌ వాజ్‌కు ఉద్వాసన

సంచలనం సృష్టించిన ముఖేష్‌ అంబానీ బెదిరింపు కేసులో అరెస్టయిన పోలీసు అధికారి సచిన్‌ వాజ్‌ను ఉద్యోగం నుంచి ఉద్వాసన పలికారు.  ఈ కేసులో ఇప్పటికే వాజ్‌ను అధికారులు సస్పెండ్‌ చేశారు.

థానే వ్యాపారవేత్త మన్సుఖ్ హిరాన్ మరణానికి సంబంధించి కూడా వాజ్‌ దర్యాప్తు చేస్తున్నారు. ముంబైలోని ముఖేష్ అంబానీ ఇల్లు ఆంటిలియా సమీపంలో జెలటిన్ స్టిక్స్‌తో ఉన్న కారును గుర్తించారు. ఈ రెండు కేసులను విచారిస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసిన సచిన్‌ వాజ్ ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. 

వాజ్‌ను మార్చిలో ఎన్‌ఐఏ అరెస్టు చేసిన తర్వాత సస్పెండ్ చేశారు. ఆంటిలియా కేసు మహారాష్ట్రలో పెను రాజకీయ తుఫానుకు దారితీసింది. రాష్ట్రంలోని పబ్‌లు, హోటళ్ల నుంచి రూ.100 కోట్లు వసూలు చేయాలని వాజ్‌ను రాష్ట్ర హోంమంత్రిగా ఉన్న ఎన్సీపీ నాయకుడు అనిల్ దేశ్‌ముఖ్ ఆదేశించారని ముంబై పోలీస్ చీఫ్ పదవి నుంచి తొలగింపునకు గురైన పరంబీర్ సింగ్ ఆరోపించారు.

ఈ ఆరోపణల నేపథ్యంలో దేశ్‌ముఖ్ గత నెలలో మహారాష్ట్ర హోంమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అతడిపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. పరంబీర్‌ సింగ్ తనపై తప్పుడు ఆరోపణలు చేశాడని దేశ్ ముఖ్ ఆరోపించారు.  ‘ఎన్‌ఐఏ దర్యాప్తు ప్రారంభించినప్పుడు సింగ్‌ను ముంబై పోలీసు కమిషనర్ పదవి నుంచి బదిలీ చేయడంతో దానికి ప్రతీకారంగా నాపై తప్పుడు ఆరోపణలు చేశాడు’ అని అనిల్ దేశ్‌ముఖ్ పేర్కొన్నారు.

ఫిబ్రవరి 25 న హిరాన్‌కు చెందిన మహీంద్రా స్కార్పియో ఎస్‌యూవీలో 20 వదులుగా ఉన్న జెలటిన్ స్టిక్క్‌ పెట్టి ఆంటిలియా సమీపంలో వదిలివేసినట్లు గుర్తించారు. అదే రోజున గామ్‌దేవి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మొదట ఈ కేసును వాజ్‌ దర్యాప్తు చేశారు. అయితే, ఫిబ్రవరి 17 న హిరాన్‌తో అతడికి సంబంధాల గురించి నివేదికలు రావడంతో ఆయనను దర్యాప్తు అధికారి పదవి నుంచి తొలగించారు. మార్చి 5 న హిరాన్ చనిపోయి కనిపించాడు. 

ఈ కేసులో వాజ్‌తో పాటు సీఐయూలో తన మాజీ సహోద్యోగి, అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ రియాజుద్దీన్ కాజీ, మాజీ పోలీసు వినాయక్ షిండే, క్రికెట్ బుకీ నరేష్ రామ్నిక్లాల్ గోర్లను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఈ రెండు కేసుల్లోనూ వాజ్‌ను ప్రధాన నిందితుడిగా ఎన్‌ఐఏ పేర్కొన్నది.