ప్రముఖ అస్సామీ ర‌చ‌యిత బొర్గొహైన్‌ క‌న్నుమూత‌

కరోనాతో  ప‌్ర‌ముఖ అస్సామీ ర‌చ‌యిత‌, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌, సాహిత్య అకాడ‌మీ విజేత హోమెన్ బొర్గోహైన్ బుధ‌వారం ఉద‌యం తుదిశ్వాస విడిచారు. 88 ఏండ్ల బొర్గోహైన్ గ‌త నెల 24న క‌రోనా పాటివ్‌గా నిర్ధార‌ణ అయ్యారు. దీంతో ఆయ‌న గువాహ‌టి మెడిక‌ల్ కాలేజీ అండ్ హాస్పిట‌ల్‌లో చేరారు. 
 
మే 7న క‌రోనా నెగెటివ్ రావ‌డంతో ద‌వాఖాన నుంచి డిశ్చార్జీ అయ్యారు. అయితే క‌రోనా స‌మ‌స్య‌ల‌తో ఇవాళ ఉద‌యం గువాహ‌టీలోని ఓ న‌ర్సింగ్‌లో చేరాయి. చికిత్స పొందుతుండ‌గా గుండెపోటు రావడంతో ఆయ‌న మృతిచెందారు. 

ఆయన మృతితో అసోం సాహిత్య లోకం మూగబోయింది. అతడి మృతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంతాపం ప్రకటించారు. అధికారికంగా అంత్యక్రియలు జరిపించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అసోంకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 

అస్సాంలోని లక‌్ష్మీపూర్‌ జిల్లా దుకువాఖానాలో డిసెంబర్‌ 7, 1932న హోమెన్‌ జన్మించారు. అస్సామీలో రచించిన ‘పిటా పుత్రా’ అనే రచనకు 1978లో కేంద్ర సాహిత్య అకాడమీ వరించింది. అయితే 2015లో జరిగిన నిరసనలకు వ్యతిరేకంగా ఆయన ఆ అవార్డు తిరిగి వెనక్కి ఇచ్చేశారు. ‘సౌదర్‌ నవ్‌ మెలీ జయ్‌’, ‘హల్దోయా సొరయే బౌదన్‌ ఖాయ్‌’, ‘అస్తరాగ్‌’, ‘తిమిర్‌ తీర్థ’, ‘మత్స్యగంధ’, ‘సుబాల’, ‘నిసంగట’, ‘ఆత్మాన్సుకందన్‌’, ‘గద్యర్‌ సాధన’, ‘ప్రొగ్యర్‌ సాధన’ తదితర రచనలు చేశారు.

అస్సాం భాషలో ఎంతో సాహిత్య సేవ చేశారు. హోమెన్‌ భార్య నిరుపమ తములీ కూడా ప్రముఖ రచయిత్రి. ఆమె కూడా ఎన్నో రచనలు చేశారు. హోమెన్‌ పాత్రికేయుడిగా కూడా పని చేశారు. అసోం సాహిత్య సభకు 2001లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కొన్నాళ్లు అసోం సివిల్స్‌ సర్వీస్‌ అధికారిగా కూడా పని చేశారు.