జూన్ నాటికి కొవాక్సిన్ ఉత్ప‌త్తి రెండింత‌లు

క‌రోనా క‌ట్ట‌డికి వ్యాక్సిన్ ఉత్ప‌త్తిని ముమ్మ‌రంగా చేప‌ట్ట‌నున్న‌ట్టు కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ వెల్ల‌డించారు. కొవాక్సిన్ ప్ర‌స్తుత ఉత్ప‌త్తి సామ‌ర్థ్యం జూన్ నాటికి రెండింత‌లవుతుంద‌ని, జులై-ఆగ‌స్ట్ నాటికి ఆరేడు రెట్లు పెరిగేలా చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని చెప్పారు. 

సెప్టెంబ‌ర్ నాటికి భార‌త్ బ‌యోటెక్ ప్ర‌తినెలా 10 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉత్ప‌త్తి చేసే స్థాయికి చేరుతుంద‌ని పేర్కొన్నారు. డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ బుధ‌వారం వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా తెలంగాణ‌, హ‌ర్యానా, పంజాబ్, బిహార్, జార్ఖండ్, ఒడిషా, జ‌మ్ము క‌శ్మీర్ ఆరోగ్య శాఖ మంత్రుల‌తో సమావేశ‌మ‌య్యారు.

వ్యాక్సిన్ ఉత్ప‌త్తిని వేగ‌వంతం చేసేందుకు ప్ర‌భుత్వ రంగ త‌యారీదారుల వ‌ద్ద మౌలిక సౌక‌ర్యాల‌ను అప్ గ్రేడ్ చేస్తామ‌ని తెలిపారు. భార‌త్ బ‌యోటెక్ బెంగ‌ళూర్ కేంద్రంలో సామ‌ర్ధ్య పెంపు కోసం రూ 65 కోట్ల ఆర్థిక సాయం అందించ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. ముంబైలోని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వ సార‌థ్యంలోని హాఫ్కైన్ ఇనిస్టిట్యూట్ లో క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ల ఉత్ప‌త్తికి కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

కాగా,  రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) సాంకేతిక ప‌రిజ్ఞానంతో త‌యారైన ఆక్సికేర్ వ్య‌వ‌స్థ‌ల కొనుగోలుకు కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదించింది. రూ.322.5 కోట్ల‌ పీఎం కేర్స్ నిధులతో 1.5 ల‌క్ష‌ల యూనిట్ల‌ను స‌మ‌కూర్చోవాల‌ని నిర్ణ‌యించింది. మ్యానువ‌ల్‌గా నియంత్రించే ల‌క్ష యూనిట్లు, ఆటోమేటిక్‌గా ప‌ని చేసే 50 వేల యూనిట్లతోపాటు నాన్ రీబ్రిత‌ర్ మాస్క్‌ల‌ను కేంద్రం కొనుగోలు చేయ‌నున్న‌ది.

దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ తీవ్ర‌త నేప‌థ్యంలో ఆక్సికేర్ టెక్నాల‌జీని దేశంలోని కొన్ని ప‌రిశ్ర‌మ‌ల‌కు డీఆర్డీవో బ‌దిలీ చేసింది. అలాగే నిమిషానికి వెయ్యి లీట‌ర్ల ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి చేసే ఏడు ఆక్సిజ‌న్ ప్లాంట్ల‌ను ఒడిశాలో ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించింది.