రంజాన్ కంటే ముందు లాక్‌డౌన్ వద్దని ఓవైసీ ఆదేశం!

రంజాన్ కంటే ముందు లాక్‌డౌన్ పెట్టొద్దని సీఎం కేసీఆర్‌ను ఓవైసీ ఆదేశించారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. రంజాన్ పండుగ తర్వాత రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తారని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణాలో  సీఎం కేసీఆర్ ఆదేశాలు అమలు కావడం లేదని ఎద్దేవా చేశారు.

రంజాన్ పండుగకు ఇచ్చే ప్రాధ్యాన్యత ప్రజల ప్రాణాలకు సీఎం కేసీఆర్ ఇవ్వటం లేదని విమర్శించారు. ఓల్డ్ సిటీలో నైట్ కర్ఫ్యూ అమలు కావటం లేదని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఒక్క వర్గం కోసమే పనిచేస్తోందని, నిఖార్సైన హిందువునని చెప్పుకునే  కేసీఆర్ ఎందుకు మరో వర్గానికి మద్దతు ఇస్తున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ మరణాలు, కేసులను తగ్గించి చూపిస్తోందని ఆరోపించారు. వాస్తవ నివేదికలు ఇవ్వకపోవడం వలన తెలంగాణ కేంద్రం సహాయం పూర్తిగా పొందలేకపోతోందని విమర్శించారు. ప్రధాని మోదీకి సలహాలిచ్చానని సీఎం కేసీఆర్ చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు. అంతర్గత సమావేశ విషయాలు బయటకు చెప్పటం సరైంది కాదని హితవు చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణకు ఏమి చేసిందో ప్రజలకు చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కింగ్ కోఠి ఆసుపత్రిలో రోగుల మరణాలకు కారకులు ఎవరని, ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో పరిస్థితి అదుపు తప్పిందని, కరోనాతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను కాపాడే నిర్ణయాలు తీసుకుంటే సహకరిస్తామని చెప్పారు.