కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక మళ్లీ వాయిదా

ఇటీవల జరిగిన ఎన్నికలలో ఘోర పరాజయం పొందిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం పట్ల నాయకత్వం శ్రద్ద చూపడం లేదు. పార్టీపై పట్టు వదులుకోవడానికి `గాంధీ’ కుటుంభం సుముఖత వ్యక్తం చేయడం లేదు. 
 
2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిరాశాజనక ఫలితాలకు బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ ఎటువంటి అధికార హోదా లేకుండనే పార్టీని తన కనుసన్నలలో నడిపించుకొనే ప్రయత్నాలు సాగిస్తున్నారు. 
 
అప్పటి నుండి తాత్కాలిక అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న సోనియా గాంధీ దాదాపు ఇల్లు దాటి బైటకు రావడం లేదు. షెడ్యూల్ ప్రకారం జూన్ 23న పార్టీ అధ్యక్షుడి ఎన్నిక  జరగాల్సి ఉండగా, దేశంలోని కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఎన్నికను వాయిదా వేయాలని సీడబ్ల్యూసీ నిర్ణయించింది. 
 
పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన సోమవారంనాడు సీడబ్ల్యూసీ సభ్యులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అధ్యక్షుడి ఎన్నికల వాయిదా పడటం ఇది వరుసగా మూడోసారి.కాగా, తదుపరి తేదీని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అధారిటీ త్వరలోనే నిర్ణయిస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. 
 
పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుడు ఉండాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయిచిన సంగ‌తి తెలిసిందే.
 
కాగా, ప‌శ్చిమ బెంగాల్, కేర‌ళ‌, అసోం అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ పేల‌వమైన ఫ‌లితాలు సాధించ‌డం ప‌ట్ల సోనియా గాంధీ అసంతృప్తి వ్య‌క్తం చేశారు.నిరుత్సాహ‌పూరిత‌మైన ఈ ఫ‌లితాల‌తో మన లోటుపాట్ల‌ను గుర్తెర‌గాల‌ని  పేర్కొన్నారు. కేర‌ళ‌, అసోం రాష్ట్రాల్లో ప్ర‌స్తుత ప్ర‌భుత్వాల‌ను కాంగ్రెస్ ఎందుకు గ‌ద్దె దింప‌లేక‌పోయిందో స‌మీక్షించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తెలిపారు.

ప‌శ్చిమ బెంగాల్లో పార్టీ ఎందుకు తుడిచిపెట్టుకుపోయిందో ఆత్మ ప‌రిశీలన సాగించాల‌ని చెప్పారు. పార్టీలో నిస్తేజం నింపే ఈ ఫ‌లితాల‌ను వాస్త‌విక కోణంలో మ‌నం చూడ‌నిప‌క్షంలో వీటి నుంచి గుణ‌పాఠాలు నేర్చుకోలేమ‌ని స్పష్టం చేశారు.