ప్రతిపక్ష నేతగా ఎడప్పాడి పళని స్వామి 

త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి ఎడ‌ప్ప‌డి ప‌ళ‌నిస్వామి అన్నాడీఎంకే శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గా ఎన్నిక‌య్యారు. సోమ‌వారం జ‌రిగిన (ఆలిండియా అన్నా ద్ర‌విడ మున్నేట్ర ఖ‌జ‌గ‌మ్‌) ఏఐఏడీఎంకే శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశంలో ప‌ళ‌నిస్వామిని శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గా ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు. 

దాంతో ఇక నుంచి ఆయ‌న త‌మిళ‌నాడు అసెంబ్లీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.  ‘‘ఎడప్పాడి పళని స్వామి శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన ఎమ్మెల్యేలు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.’’ అని పార్టీ పేర్కొంది. పార్టీ శాసనసభా పక్ష నేతగా పళని స్వామి ఎన్నికయ్యారని పార్టీ సీనియర్లైన సెంగొట్టియన్, శ్రీనివాసన్, మును స్వామి, తంగమణి తదితరులు స్పీకర్‌కు ఓ లేఖ అందజేశారు.

ఇటీవ‌ల జ‌రిగిన త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మొత్తం 234 స్థానాల‌కుగాను ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే 160 స్థానాల్లో విజ‌యం సాధించింది. గ‌త ప‌దేండ్లుగా అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ఈ ఎన్నిక‌ల్లో కేవ‌లం 72 స్థానాల‌కు ప‌రిమిత‌మైంది. దాంతో ఇన్నాళ్లు ప్ర‌తిప‌క్ష నేత‌గా వ్య‌వ‌హరించిన స్టాలిన్ ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్ట‌గా, గ‌త నాలుగున్న‌రేండ్ల నుంచి ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన ప‌ళ‌నిస్వామి ఇప్పుడు ప్రతిపక్ష నేత  అయ్యారు. 

కాగా, రాష్ట్ర శాసనసభలో భారతీయ జనతా పార్టీ శాసన సభాపక్ష నేతగా తిరునెల్వేలి శాసనసభ్యుడు, మాజీ మంత్రి నయనార్‌ నాగేంద్రన్‌ ఎంపికయ్యారు. ఆదివారం జరిగిన ఆ పార్టీ ఎమ్మెల్యే ల సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్ను కున్నారు. 
 
రాష్ట్రాభివృద్ధికి, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వా నికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా నాగేంద్రన్  తెలిపారు. శాసనసభలో బాధ్యతా యుత ప్రతిపక్ష పార్టీగా ఉంటామేగానీ, వ్యతిరేకంగా ఉండబో మని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక చొరవచూపిస్తామని చెప్పారు.