ప్రచారం తప్ప ఒక్క దవాఖానా తెరవని ఆప్ 

ఢిల్లీలోని ఆప్-ప్రభుత్వం 2015 నుంచి ప్రకటనల కోసం దాదాపు రూ.804.93 కోట్లు ఖర్చు చేసింది. కానీ ఒక్క కొత్త ద‌వాఖాన‌ను తెరవలేదని బీజేపీ మండిప‌డింది. ప్ర‌తి విష‌యానికి కేంద్రంపై నింద‌లు మోప‌డం మిన‌హా వారికి తెలిసిందేమీ లేద‌ని బీజేపీ అధికార ప్ర‌తినిధి సంబిత్ ప‌త్రా విమ‌ర్శించారు.

ముఖ్యమంత్రి ప్రచారం కోసం కోట్లు ఖర్చు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం ద్వారా బాధ్యతలను వ‌దిలేసి చేతులు కడుక్కుంటున్నార‌ని ఆరోపించారు. కేజ్రీవాల్ నిత్యం టీవీలో కనిపిస్తూ ఉండ‌టం మిన‌హా ప్ర‌జ‌ల కోసం చేస్తున్న‌దేమీ లేద‌ని ఎద్దేవా చేశారు.

అబద్ధాల‌తో రోజులు గ‌డుపుతున్నార‌ని ఆయ‌న ధ్వజమెత్తారు. ఏ చిన్న స‌మ‌స్య వ‌చ్చినా చేయ‌కుండా చేతులు ఎత్తేస్తూ నెపం కేంద్రంపైకి నెట్టేస్తున్నార‌ని విమర్శించారు. దాదాపు రూ.1,400 కోట్ల విలువైన 1.34 కోట్ల వ్యాక్సిన్లను తమ ప్రభుత్వం ఆర్డర్‌ చేస్తుందని కేజ్రీవాల్ ఏప్రిల్ 26 న పేర్కొన్నట్లు పత్రా గుర్తు చేశారు. ఇంత అబ‌ద్ధాలు చెప్తున్న ప్ర‌భుత్వం ఇదొక్క‌టేనేమో అని ప‌త్రా మండిపడ్డారు.

ప్ర‌జ‌ల‌కు టీకాలు అందించే కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌కుండా ప్ర‌క‌ట‌న‌లు జారీ చేయ‌డం వ‌ల్ల ఎలాంటి లాభం ఉంటుందో ఆప్ నాయ‌కుల‌కే తెలియాల‌ని విస్మయం వ్యక్తం చేశారు. ఆక్సిజ‌న్ ప్లాంట్ల ఏర్పాటుకు పీఎం కేర్స్ నుంచి నిధులు కేటాయించినా.. స్థలం చూపించ‌కుండా కాలాయాప‌న చేసి ఇప్పుడు ఆక్సిజ‌న్ క‌ర‌వు అంటూ దొంగ మాట‌లు మాట్లాడుతున్నార‌ని సంబిత్ ప‌త్రా ధ్వజమెత్తారు.