జార్ఖండ్‌ సీఎం ట్వీట్‌ను ఖండించిన జగన్‌

ప్రధాని నరేంద్ర మోడీపై జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి  ట్విట్టర్‌ వేదికగా తీవ్రంగా  స్పందించారు. కరోనా పరిస్థితుల్లో రాజకీయాలు సరికాదంటూ చురకలంటించారు.

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న దృష్ట్యా ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను తెలుసుకోడానికి ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల సీఎంలతోపాటు, ఒడిశా, జార్ఖండ్, ఏపీ ముఖ్యమంత్రులకు గురువారం ఫోన్‌ చేశారు. సమావేశంలో ఆయా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సమావేశం అనంతరం జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ ప్రధాని తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

‘‘ఈ రోజు గౌరవనీయులైన ప్రధాని నాకు ఫోన్‌ చేశారు. ఆయన మనసులో ఉన్నదే మాట్లాడారు. కరోనా కట్టడికి ఏం చేయాలో చెప్పి మా విషయాలు కూడా వింటే బాగుండేది’’ అని సీఎం సోరెన్‌ ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలను ఏపీ సీఎం జగన్ శుక్రవారం ట్విట్టర్‌ వేదికగా తప్పుబట్టారు.

‘‘ప్రియమైన ముఖ్యమంత్రి గారు మీరంటే నాకు ఎంతో గౌరవం ఉంది. కానీ, ఒక సోదరుడిగా ఒక విన్నపం చేస్తున్నాను. మన మధ్య ఎటువంటి విభేదాలైనా ఉండొచ్చు. కానీ, ఇలాంటి రాజకీయాలు మన సొంత దేశాన్ని బలహీనపరుస్థాయి” అంటూ హెచ్చరించారు. 

 ఇది కొవిడ్‌పై యుద్ధం జరుగుతున్న సమయం. ఇలాంటప్పుడు ఒకరిని వేలెత్తి చూపించే బదులు… మనమంతా కలిసి కొవిడ్‌పై సమర్థంగా యుద్ధం సాగించేలా ప్రధానమంత్రిని బలోపేతం చేయాలని హేమంత్‌ సొరేన్‌కు హితవు చెప్పారు. అందరం కలిసికట్టుగా ప్రధానికి మద్దతుగా నిలవాలని పిలుపిచ్చారు.