సంగం డెయిరీ స్వాధీనం జీవో కొట్టివేత 

సంగం డెయిరీ కేసులో ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. సంగం డెయిరీ స్వాధీనంపై జీవోను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. సంగం డెయిరీ స్వాధీనంపై ప్రభుత్వం జారీ చేసిన జీవో చెల్లదని హైకోర్టు తెలిపింది. 

సంగం డెయిరీ కార్యకలాపాలను డైరెక్టర్లు నిర్వహించుకోవచ్చని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రోజువారీ కార్యకలాపాలను డైరెక్టర్లు పర్యవేక్షించాలని హైకోర్టు సూచించింది. సంగం డెయిరీ ఆస్తుల అమ్మకంపై కోర్టు అనుమతి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

అలాగే సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్ర క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణపై స్టే ఇవ్వాలని ధూళిపాళ్ల న్యాయవాదులు కోరారు. 

సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయంటూ.. ఏపీ సీఐడీ అధికారులు ఇప్పటికే డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రతో పాటు ఎండీ గోపాలకృష్ణన్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. వీరిద్దరికి కారోనా పాజిటివ్ నిర్ధారణ కాగా చికిత్స పొందుతున్నారు. దీంతో విచారణ కష్టమైనట్లు హైకోర్టుకు సీఐడీ అధికారులు తెలిపారు.

ధూళిపాళ్లకి కరోనా సోకటంతో విచారణ చేయలేని పరిస్థితి ఉందని కోర్టుకు సీఐడీ అధికారులు వెల్లడించారు. కస్టడీ పొడిగింపుపై ఏసీబీ కోర్టునే విచారణ చేయమని హైకోర్టు తెలిపింది. సంగం డెయిరీ సమాచారాన్ని.. ప్రైవేట్ వ్యక్తులకు పోలీసులు ఇస్తున్నారని పిటిషనర్లు కోర్టుకి తెలిపారు. తదుపరి విచారణను హైకోర్టు జూన్ 17కు వాయిదా వేసింది.

ఇలా ఉండగా, సంగం డెయిరీలో గురువారం మధ్యాహ్నం అవినీతి నిరోధకశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించేందుకు వెళ్లారు. కంప్యూటర్లను, సర్వర్లను పరిశీలించేందుకు అధికారులు యత్నించగా యాజమాన్యం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

మార్కెటింగ్‌ డేటా  ఉండే సర్వర్లను బయట వ్యక్తులు తనిఖీ చేయడంపై నిరసన వ్యక్తం చేసింది. తనిఖీలకు బయటి వ్యక్తలు వచ్చారని యాజమాన్యం ఆరోపించింది. గత శనివారం కూడా సంగం డెయిరీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.