ఐపీఎల్ 14వ సీజ‌న్ నిర‌వ‌ధిక వాయిదా

ఐపీఎల్ 14వ సీజ‌న్‌ను స‌స్పెండ్‌ చేసింది బీసీసీఐ. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ టీమ్‌లో వృద్ధిమాన్ సాహా, అటు అమిత్ మిశ్రా కూడా క‌రోనా బారిన ప‌డ‌టంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో టోర్నీలో క‌రోనా బారిన ప‌డిన వాళ్ల సంఖ్య నాలుగుకు చేరింది. ఇక త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో లీగ్‌ను స‌స్పెండ్‌ చేస్తున్న‌ట్లు బీసీసీఐ ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా వెల్ల‌డించారు. 

టోర్నీని రీషెడ్యూల్ చేసే అవ‌కాశాన్ని ప‌రిశీలిస్తున్నాం. ఇప్ప‌టికైతే పూర్తిగా రద్దు చేయ‌లేదు అని రాజీవ్ శుక్లా చెప్పారు. మంగ‌ళ‌వారం ముంబై ఇండియ‌న్స్‌తో స‌న్‌రైజ‌ర్స్ త‌ల‌పడాల్సి ఉంది. అయితే సాహాకు పాజిటివ్‌గా తేల‌డంతో స‌న్‌రైజ‌ర్స్ టీమంతా ఐసోలేష‌న్‌లోకి వెళ్లిపోయింది.

మొద‌ట కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ టీమ్‌లో వ‌రుణ్ చక్ర‌వ‌ర్తి, సందీప్ వారియ‌ర్ క‌రోనా బారిన ప‌డ‌టంతో సోమ‌వారం జ‌ర‌గాల్సిన కోల్‌క‌తా, బెంగ‌ళూరు మ్యాచ్‌ను ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా మంగ‌ళ‌వారం స‌న్‌రైజ‌ర్స్ టీమ్‌లో వృద్ధిమాన్ సాహా కూడా కొవిడ్ బారిన ప‌డిన‌ట్లు తేలింది. మొద‌ట లీగ్‌లో మిగిలిన మ్యాచ్‌లను ముంబైలోనే నిర్వ‌హించాల‌న్న ఆలోచ‌న చేస్తున్నట్లు వార్త‌లు వ‌చ్చినా.. తాజాగా సాహా, అమిత్ మిశ్రాలు కూడా క‌రోనా బారిన ప‌డ్డార‌ని తేల‌డంతో ఐపీఎల్ 14వ సీజ‌న్‌ను నిర‌వ‌ధికంగా వాయిదా వేస్తున్న‌ట్లు రాజీవ్ శుక్లా స్ప‌ష్టం చేశారు.

నిజానికి దేశాన్ని కరోనా సెకండ్ వేవ్ అత‌లాకుత‌లం చేస్తున్న ఈ స‌మ‌యంలో ఐపీఎల్ నిర్వ‌హించ‌డంపై మొద‌టి నుంచీ విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయితే బీసీసీఐతోపాటు ఫ్రాంచైజీలు కూడా టోర్నీ నిర్వ‌హ‌ణ‌ను స‌మ‌ర్థించుకున్నాయి.

 అయినా ఎంతో క‌ఠినంగా ఉండే బ‌యో బ‌బుల్‌లో ప్లేయ‌ర్స్‌ను ఉంచి టోర్నీ నిర్వ‌హిస్తుండ‌టం వ‌ల్ల వాళ్ల‌కు క‌రోనా ముప్పు ఉండ‌ద‌ని వాదించారు. అయితే స్కానింగ్ కోస‌మ‌ని బ‌బుల్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లి వ‌చ్చిన కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ప్లేయ‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, మ‌రో ప్లేయ‌ర్ సందీప్ వారియ‌ర్ క‌రోనా బారిన ప‌డ్డార‌ని తేల‌డంతో లీగ్‌లో క‌ల‌క‌లం రేగింది.

అప్ప‌టిక‌ప్పుడు సోమవారం జ‌ర‌గాల్సిన మ్యాచ్‌ను వాయిదా వేశారు. ఎలాగోలా లీగ్‌ను కొన‌సాగించాల‌నే భావించారు. కానీ తాజాగా స‌న్‌రైజ‌ర్స్ టీమ్‌లో సాహా, ఢిల్లీ టీమ్‌లో మిశ్రాకు కూడా క‌రోనా సోక‌డంతో ఇక లాభం లేద‌నుకొని టోర్నీని నిర‌వ‌ధికంగా వాయిదా వేశారు. 

ఈ సీజ‌న్ కూడా యూఏఈలో నిర్వ‌హించాల‌ని మొద‌ట ప్ర‌తిపాద‌న వ‌చ్చినా.. బీసీసీఐ మాత్రం ఇక్క‌డే నిర్వ‌హించ‌డానికి మొగ్గు చూపింది. ఇప్పుడు క‌రోనా కార‌ణంగా ఐపీఎల్‌నే వాయిదా వేయ‌డంతో అక్టోబ‌ర్‌లో జ‌ర‌గాల్సిన టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌పైనా నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి.