తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ విధించాలి

తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ విధించాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కోరారు.  కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే ఉన్నతాధికారుల సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. వైద్య, ఆరోగ్యశాఖను తీసుకుని ఫాంహౌస్‌లో కేసీఆర్ కూర్చుంటే ఉపయోగంలేదని ధ్వజమెత్తారు. 

కక్ష సాధింపులకు ముఖ్యమంత్రి  ఉన్న సమయం.. ప్రజల ఆరోగ్యంపై లేకపోవటం బాధాకరమని చెప్పారు. కరోనా నియంత్రణ కోసం కూడా నలుగురు ఐఏఎస్ అధికారులను నియమిస్తే సంతోషించే వాళ్లమని తెలిపారు. ఆక్సిజన్ బ్లాక్ మార్కెట్, ఆస్పత్రుల దోపిడీని అడ్డుకోవటంలో ప్రభుత్వం విఫలమైందని బండి సంజయ్ కుమార్  ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాలకులకు మానవత్వం లేకుంటే ప్రజల ప్రాణాలకే ముప్పని చెప్పారు. శ్మశానవాటికలో కెమెరాలు ఏర్పాటు చేస్తే తెలంగాణలో వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని పేర్కొన్నారు. కనీసం మారు వేషంలోనైనా కేసీఆర్ ఆస్పత్రులను పరిశీలించాలని కోరుకుంటున్నానని చెప్పారు. 

రాష్ట్రాల హక్కుల్లో కేంద్రం కలగజేసుకోదని సంజయ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి ఆరోగ్యంగా ఉంటేనే ప్రజల ఆరోగ్యం బాగుంటోందని బండి సంజయ్ పేర్కొన్నారు.