తిరుపతిలో వైఎస్సార్‌సీపీ భారీ విజయం

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి పార్లమెంటు స్థానానికి జరిగిన ఉపఎన్నికలో వైఎస్‌ఆర్‌సీపీ ఘనవిజయం సాధించింది. పార్టీ అభ్యర్థి గురుమూర్తి 2,30,572 ఓట్లతో తిరుగులేని మెజారిటీ సాధించారు. 

ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి 5,33,961 ఓట్లు పోలవగా, తెలుగుదేశం పార్టీకి 3,02,580 ఓట్లు వచ్చాయి. ఇక జనసేనతో కలిసి ఎన్నికల బరిలో దిగిన బీజేపీ  50,354 ఓట్లు మాత్రమే సాధించ గలిగింది.

2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తిరుపతి నియోజకవర్గంలో వైసీపీ నుంచి బల్లి దుర్గాప్రసాద్‌ గెలుపొందారు. గతేడాది ఆయన కరోనాతో మరణించడంతో ఉపఎన్నిక అనివార్యమయ్యింది. దీంతో తిరుపతి లోక్‌సభ స్థానానికి ఏప్రిల్‌ 17న ఉపఎన్నిక జరిగింది.

 ఇక్కడ టీడీపీ నుంచి మాజీ మంత్రి పనబాక లక్ష్మి పోటీచేశారు. బీజేపీ అభ్యర్థిగా కర్ణాకట ప్రభుత్వం మాజీ ప్రధాన కార్యదర్శి రత్నప్రభ పోటీ చేశారు.  ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి వైసీపీ ఆధిక్యం ప్రదర్శించి. ప్రతి రౌండ్‌లో మెజారిటీ పెంచుకుంటూ పోయింది. 

ఓట్ల లెక్కింపు సగం పూర్తయ్యేవరకు ఆ పార్టీ అభ్యర్థి గురుమూర్తి.. ప్రత్యర్థికి అందనంత మెజారిటీలో నిలిచి గెలపు ఖాయం చేసుకున్నారు. మొత్తంగా వైసీపీకి 57 శాతానికిపైగా ఓట్లు పోలయ్యాయి.