`అమర రాజా’లో 9 యూనిట్లు మూత

అమరరాజా పరిశ్రమలో బ్యాటరీల తయారీకి సంబంధించిన తొమ్మిది యూనిట్లు మూతపడ్డాయి. శనివారం రాష్ట్ర పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఆదేశాల మేరకు ఎస్పీడీసీఎల్‌ అధికారులు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. ఉన్నట్టుండి విద్యుత్‌ సరఫరా ఆపివేయడంతో అమరరాజా సంస్థకు సుమారు రూ.50 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అంచనా. 

తొమ్మిది యూనిట్లు మూతపడడంతో వీటిలో పనిచేస్తున్న 16 వేల మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన చెందుతున్నారు. అంతేగాక ఈ యూనిట్ల నుంచి జరిగే ఉత్పత్తుల రవాణా, మార్కెటింగ్‌ వంటి రంగాల ద్వారా దేశవ్యాప్తంగా మరో 80 వేల మందికి పైగా ఆధారపడి ఉన్నారు. వీరి ఉపాధి కూడా ప్రశ్నార్థకంగా మారింది. 

చిత్తూరు జిల్లాలోని రేణిగుంట మండలం కరకంబాడి ఆవరణలో నాలుగు, యాదమరి మండలం నూనెగుండ్లపల్లె వద్ద ఐదు యూనిట్లను అమరరాజా సంస్థ నెలకొల్పింది. ఈ యూనిట్ల నిర్వహణ వల్ల చుట్టుపక్కల గ్రామాల్లో జలకాలుష్యం తలెత్తి ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందని, సంబంధిత యూనిట్లను మూసివేయాలంటూ ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఏప్రిల్‌ 30న ఆదేశాలు జారీ చేసింది. 

యూనిట్లకు విద్యుత్‌ సరఫరా ఆపేయాల్సిందిగా ఎస్పీడీసీఎల్‌ను కూడా ఆదేశించింది. విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంతో ప్రాసె్‌సలో ఉన్న వివిధ రకాల బ్యాటరీలు దెబ్బతిన్నట్టు సమాచారం. దానివల్ల అమరరాజా సంస్థకు సుమారు రూ. 50 కోట్ల మేరకు నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

కాగా, పర్యావరణ పరిరక్షణకు, అదే సమయంలో వాటాదారుల ప్రయోజనాలకు అమరరాజా సంస్థ  ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని యాజమాన్యం స్పష్టం చేసింది. శనివారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. అమరరాజా బ్యాటరీస్‌ లిమిటెడ్‌ యూనిట్లను మూసివేయాల్సిందిగా ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు నుంచి ఏప్రిల్‌ 30న తమకు ఆదేశాలు అందాయని అందులో పేర్కొంది. 

వీటిని పూర్తిస్థాయిలో సమీక్షించామని, దేశ విదేశాల్లో అతి కీలక రంగాలైన రక్షణ, వైద్య, టెలికాం విభాగాలకు ఉత్పత్తులను అందజేస్తున్న తమ కంపెనీ వాణిజ్య, సామాజిక, పర్యావరణ పరిరక్షణల విషయంలో కచ్చితమైన నియమ నిబంధనలను పాటిస్తోందని పేర్కొంది.

ఇలా ఉండగా, పరిశ్రమ యాజమాన్య కుటుంబానికి చెందిన మాజీ మంత్రి గల్లా అరుణకుమారి టీడీపీలో కీలక నేతగా ఉన్నారు. ఆమె కుమారుడు గల్లా జయదేవ్‌ గుంటూరు నుంచి టీడీపీ తరపున వరుసగా రెండోసారి ఎంపీగా గెలిచారు. దానితో రాజకీయ కక్షసాధింపు చర్యలలో భాగంగా ప్రభుత్వం ఇటువంటి తీవ్రమైన చర్యకు దిగిన్నట్లు విమర్శలు చెలరేగుతున్నాయి.